You are currently viewing 10వ తరగతి పరీక్షల్లో చీఫ్ సూపర్డెంట్లు, ఇన్విజిలేటర్లు కీలక పాత్ర పోషించాలి

10వ తరగతి పరీక్షల్లో చీఫ్ సూపర్డెంట్లు, ఇన్విజిలేటర్లు కీలక పాత్ర పోషించాలి

పాస్ పర్సెంటేజీ కోసం మాస్ కాపీయింగ్ తలపడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవు

సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

(బిఎన్ న్యూస్‌), మార్చి 16: 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో చీఫ్ సూపర్డెంట్లు, ఇన్విజిలేటర్లు కీలక పాత్ర పోషించి పరీక్షల నిర్వహణలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వైయస్సార్ సెంటనరీ హాలులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల పకడ్బందీ నిర్వహణపై చీఫ్ సూపర్డెంట్లు, కస్టోడియన్ అధికారులు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఎంఈఓల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ తదితర అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు. ఒక చిన్న రూమర్ మొత్తం ప్రక్రియనంతటిని చిన్నాభిన్నం చేస్తుందని, అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాలో గత సంవత్సరం ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్ లలో పోస్ట్ అయి వైరల్ కావడం కారణంగా సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చీఫ్ సూపర్నెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఎంఈఓలు, ఇన్విజిలేటర్లు చిత్తశుద్ధితో అప్రమత్తంగా పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పాస్ పర్సెంటేజీ కోసం పాఠశాలల్లో మాస్ కాపీయింగ్ తలపడితే సంబంధిత చీప్ సూపర్నెంట్, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్ల పై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 125 పరీక్షా కేంద్రాల్లో 25,411 మంది విద్యార్థులు పరీక్షలను రాస్తున్న నేపథ్యంలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన 6 సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాంపౌండ్ వాల్ లేని పాఠశాలల్లో బారీకేడింగ్ ఏర్పాటు చేసి అనధికారిక వ్యక్తులెవరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫర్నీచర్, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులు మూసి వేయడం జరుగుతుందన్నారు. పరీక్షలకు గైరు హాజరైన విద్యార్థుల ప్రశ్నాపత్రాలు అల్మారాలో జాగ్రత్తగా భద్రపరిచేందుకు చీఫ్ సూపర్నెంట్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలకు సంబంధించి ఏ ఒక చిన్న ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై సీరియస్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, డీఈఓ అనురాధ, చీఫ్ సూపర్నెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఎంఈఓలు, కస్టోడియన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.