You are currently viewing ఎన్నికల నిబంధలు అందరూ పాటించాలి

ఎన్నికల నిబంధలు అందరూ పాటించాలి

ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన చర్యలు తప్పవు

-జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

(బిఎన్ న్యూస్‌), మార్చి 11: ప‌ట్ట‌ణంలోని బొమ్మ‌ల‌స‌త్రం వ‌ద్ద ఎస్పీ కార్యాల‌యంలో శ‌నివారం జిల్లా కె.రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిబంధ‌న‌ల పై స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పోలింగ్ బూత్‌ల వద్దకు ఓటర్లు మొబైల్ ఫోన్స్, ఐ పాడ్, టాబ్స్, ఎలెక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తప్పవని తెలియ‌జేశారు. ఈనెల 13న జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రత, బందోబస్త్ ఏర్పాటు చేశామని, ఎన్నికలు పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిబంధలు ప్రతి ఒక్కరు పాటించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవ్వరూ గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు. అభ్యర్ధులు, ఓటర్లు, ఏజెంట్లు ఎన్నికల నియమావళిని (ఎంసిసి) తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆర్.ఓ అధికారి యొక్క ఉత్తర్వులు తూచా తప్పకుండా పాటించాలి. పోలింగ్ నిర్వహించే అధికారులతో సహా ఎవరు పోలింగ్ కేంద్రాలలోనికి నీరు, ఇతర ద్రవ పదార్ధాలను తీసుకువెళ్లరాదు. ఓటర్లు, ఏజెంట్లు, అభ్యర్ధులు మొబైల్ ఫోన్స్, ఐ పాడ్, టాబ్స్, ఇతర ఎలెక్ట్రానిక్ వస్తువులు పోలింగ్ కేంద్రంలోనికి తీసుకువెళ్ళడానికి అనుమతిలేదన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలులో ఉంటున్నందున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా వాక్యాలు చేయడం, కవ్వింపు చర్యలకు గాని పాల్పడటం వంటివి చేయరాదు. అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి పనులు చేయరాదు. ఎవరైనా పోలింగ్ బూతు లోపల ఫోటోలు, వీడియోలు తీసి ఎన్నికల నియమాలకు విరుద్ధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడునని హెచ్చ‌రించారు. జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 61 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు, 30 ఉపాధ్యాయుల పోలింగ్ కేంద్రాలు, 3 స్థానిక సంస్థలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీస్ సిబ్బంది మోహరిస్తున్నామన్నారు. జిల్లాలో రూట్ మొబైల్స్, చెక్ పోస్ట్స్, పిక్కెట్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్ టీమ్స్, పోలింగ్ స్టేషన్ల వద్ద ఇలా జిల్లా మొత్తంగా 590 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విదులలో ఉంటారని తెలియజేశారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచారాలు కదలికలు ఉండకూడదని ఎస్పి స్పష్టం చేశారు. పోలింగ్ శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన తెలిపారు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా ఎలక్షన్ కమిషన్ వారికి, స్ధానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందింస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు.