You are currently viewing ఇంటర్మీడియట్, 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి -జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి

ఇంటర్మీడియట్, 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి -జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి

నంద్యాల, (బిఎన్ న్యూస్‌), మార్చి 06: ఈ నెల 15 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుండి 18వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్, 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి మాట్లాడుతూ ఈనెల 15 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుండి 18వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 51 పరీక్షా కేంద్రాల్లో 26,970 మంది విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 125 పరీక్షా కేంద్రాల్లో 25,411 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆమె సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని రెవిన్యూ అధికారులకు సూచించారు. కేంద్రాల వద్ద పారిశుద్ధంతోపాటు త్రాగునీటి వసతులు కల్పించాలని మున్సిపల్ కమీషనర్‌ను సూచించారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రథ‌మ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. పరీక్షా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా ఉండేలా అన్ని రూట్లలో ఆర్టీసి బస్సులు నడపాలని ఆర్.టి.సి అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసి వేసేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాలను పార్సెల్ ద్వారా డిస్పాచ్ చేసేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించాలని పోస్టల్ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి పుల్లయ్య, ఆర్ఐఓ గురువయ్య చెట్టి, డీఈఓ అనురాధ, డిఐఈఓ సునీత, మునిసిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.