You are currently viewing స్పందన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

స్పందన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

నంద్యాల‌, (బిఎన్ న్యూస్‌), మార్చి 06: పట్ట‌ణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి 57 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, స్పందన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఎక్కువగా సివిల్ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, అత్తరింటి వేదింపులు మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు
1)నా పెద్ద కొడుకు నేను ఉన్న ఇల్లు లాక్కొని ఇంటి నుంచి బయటికి పంపించి వేసి అన్నం పెట్టకుండా ఇంట్లో ఉండనీయకుండా వేధిస్తున్నాడని నాకు న్యాయం చేయండి అని డోన్ పట్టణానికి చెందిన జి.గంగిరెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2) కాంట్రాక్ట్ బేసిక్ కింద శ్రీశైలంలో శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు పనులు చేయించుకుని కాంట్రాక్టర్ అయిన పార్వతమ్మ మేము చేసిన పనులకు డబ్బులు ఇవ్వడం లేదని ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన గోకారి నారాయణ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 3) రైల్వేలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయని రెండు లక్షల 50 వేలు డబ్బులు కడితే ఉద్యోగం ఇప్పిస్తానని వై.హరి ప్రసాద్ అనే వ్యక్తి మరికొందరు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని డోన్ పట్టణంలోని టిఆర్ నగర్‌కు చెందిన విజయభాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల పై అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ప్రతి సోమవారం ప్రతి పోలీసు స్టేషన్, సర్కల్, డి‌ఎస్‌పి కార్యాల‌యాల‌లో స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా పోలీసు కార్యాలయానికి సంబందిత సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ, ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ రామాంజీ నాయక్ పాల్గొన్నారు.