You are currently viewing చెంచు గూడెంలలో మౌలిక వసతులు కల్పించండి

చెంచు గూడెంలలో మౌలిక వసతులు కల్పించండి

అన్ని సంక్షేమ పథకాల లబ్ది గిరిజనులకు అందించండి

ప్రతి శాఖ నుండి ఒక అధికారిని కేటాయించండి

ఐటిడిఎ, సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

(బిఎన్ న్యూస్‌), మార్చి 03: జిల్లాలోని 42 చెంచు గూడెంలలో త్రాగునీరు, పక్కా ఇళ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఐటిడిఎ, సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో చెంచు గూడెంలలో అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ జిల్లాలోని 14 మండలాల్లోని 42 చెంచు గూడెంలలో నివశిస్తున్న 8,160 మంది గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జల జీవన్ మిషన్ కింద నివాసముంటున్న 2103 కుటుంబాలకు ఇంటింటికి కొళాయి మంజూరు చేయాలన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా త్రాగునీటి వనరులను గుర్తించడంతో పాటు మరమ్మతులకు గురైన 8 త్రాగునీటి బోర్లను వెంటనే రిపేర్లు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. జిఎస్ఎల్ఆర్, ఓఆర్ హెచ్ఎస్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయడంతో పాటు నీటిని క్లోరినేట్ చేసి సరఫరా చేయాలన్నారు. పైపులైన్లలో లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయించాలన్నారు. రైతు భరోసా, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, వైయస్సార్ క్రాంతి పదం, స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీ, వైయస్సార్ పెన్షన్ కానుక తదితర నవరత్న సంక్షేమ పథకాలన్ని గ్రాస్ రూట్ లెవెల్లో పరిశీలించి సంక్షేమ పథకాల లబ్ది పొందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్ఓఎఫ్ఆర్ భూముల అభివృద్ధి, విద్యా, వైద్యం, జీవన భృతి తదితర అన్ని అంశాల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రెండు వారాల్లో సమర్పించాలని కలెక్టర్ సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ నుండి ఒక అధికారిని కేటాయించి గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు అందించేలా కృషి చేయాలన్నారు. గూడెంలలో రక్తహీనత గల స్త్రీలు, పోషక లోపాలున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం లింగ నిర్ధారణ, వడదెబ్బ సోకకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.