You are currently viewing రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టండి

రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టండి

ఈ నెల 7వ తేదీలోగా ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయండి

రెవెన్యూ అంశాలలో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించండి

రెవెన్యూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి

(బిఎన్ న్యూస్‌), మార్చి 03: జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టి రెవెన్యూ రికార్డుల మేరకు నాణ్యతతో భూ వివాదాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ అన్ని మండలాల తహ‌సీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో పిఓఎల్ఆర్ రీ సర్వే, ఎమ్మెల్సీ ఎన్నికలు, భూసేకరణ, ఇళ్ల పట్టాలు, కోర్టు కేసుల సత్వర పరిష్కారం తదితర రెవిన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ టి.నిషాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ పిఓఎల్ఆర్ కింద చేపట్టిన సర్వేలో నాణ్యత ప్రమాణాలు పాటించి రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా పకడ్బందీగా చేపట్టాలన్నారు. భూ వివాదాలను పరిష్కరించడమే సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యమని నాణ్యతతో నిర్దేశిత సమయంలోగా సర్వే పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. బనగానపల్లి, కోవెలకుంట్ల, గోస్పాడు, చాగలమర్రి, నందికొట్కూరు తదితర అన్ని మండలాలు పిఓఎల్ఆర్ సర్వే పెండింగులో ఉందని త్వరితగతిన పూర్తి చేసేందుకు తహ‌సీల్దారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. చేపట్టిన రీ సర్వే నాణ్యతతో పరిష్కరించకుంటే అనేక రకాల డిస్ప్యూట్స్ రావడంతో పాటు స్పందన కార్యక్రమంలో మళ్లీ మళ్లీ దరఖాస్తులు వస్తాయన్నారు. వెబ్ లాండ్, ఆర్ఓఆర్‌లో ఉన్న భూముల విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూముల విస్తీర్ణానికి తేడాలున్నట్లు పత్రికల్లో ప్రతికూల వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో నిశితంగా పరిశీలించి సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసిన సర్వే ప్రక్రియను ఆర్డీవోలు, తహ‌సీల్దార్ల‌ను ర్యాన్డంగా చెక్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7వ తేదీ సాయంత్రం లోగా ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలని, ఇందుకు సంబంధించి రోజువారి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ తహ‌సీల్దార్లను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఆయా మండల కేంద్రాలలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్నికల నిబంధనల మేరకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఈ మేరకు నిరంతర విద్యుత్తుతో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని మండలాల్లో ఫామ్ 6 బి పెండింగ్లో ఉందని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సేకరణ కింద వివిధ శాఖలకు స్వాధీనం చేసిన భూముల్లో సంబదిత ప్రాజెక్టు పనులు గ్రౌండింగ్ కావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లేని పక్షంలో కేటాయించిన భూములు ఆక్రమణలకు గురికావడమే కాకుండా వివాదాస్పద సమస్యలు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన స్థలాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోర్టు తుది ఉత్తుర్వులు 123 లో 31 మాత్రమే అమలు చేశారని మిగిలిన 92 ఉత్తుర్వులు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి మాట్లాడుతూ టాప్-4, టాప్ 10 లో వున్న సర్వీసులు వెంటనే క్లియర్ చేయాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించి తహ‌సీల్దారులు ప్రతిరోజు దృష్టి పెట్టి బియాండ్ ఎస్ఎల్ఏ లో కి వెళ్లకుండా ఎప్పటికిప్పుడు పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై ఆరా తీస్తూ ఎందుకు పెండింగ్లో ఉన్నాయని మండలాల వారీగా తాసిల్దార్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి కంటెంట్ రాకుండా కౌంటర్ ఫైల్ చేయాలని జాయింట్ కలెక్టర్ తహ‌సిల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకట్ రెడ్డి, ఎం దాసు, అన్ని మండలాల తహ‌సిల్దార్లు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.