You are currently viewing నిరుద్యోగ యువత ఓటే వజ్రాయుధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి ప్రభుత్వ పతనానికి నాంది పలకాలి -టిడిపి నాయకుడు ఏవి సుబ్బారెడ్డి

నిరుద్యోగ యువత ఓటే వజ్రాయుధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి ప్రభుత్వ పతనానికి నాంది పలకాలి -టిడిపి నాయకుడు ఏవి సుబ్బారెడ్డి

(బిఎన్ న్యూస్‌), మార్చి 03: నిరుద్యోగ యువత ఓటే వజ్రాయుధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి ప్రభుత్వ పతనానికి నాంది పలకాలని సీనియర్ టిడిపి నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించాలని సీనియర్ టిడిపి నాయకులు ఏవి సుబ్బారెడ్డి, నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎమ్‌డి ఫిరోజ్‌లు పట్టణంలో ఉదృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో నిర్వహిస్తున్న గురురాజా బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ దస్తగిరి రెడ్డిని కలిసి తమకు సహకరించాలని అభ్యర్థించారు. అదేవిధంగా కోచింగ్ సెంటర్‌లోని నిరుద్యోగ యువతతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ నిరుద్యోగులను నిండా ముంచి వేశాడని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో పాటు పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోవడంతో నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ సత్తా చాటి వైసిపి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓటు వజ్రాయుధంతో వైసిపి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అందుకు యువత కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.