You are currently viewing ఎగువభద్ర ప్రాజెక్టును ప్రభుత్వమే అడ్డుకోవాలి

ఎగువభద్ర ప్రాజెక్టును ప్రభుత్వమే అడ్డుకోవాలి

ప్రజా ప్రతి నిధులు మౌనం వీడాలి

ఈనెల 28న చలో ఆదోనిని విజయవంతం చేయండి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 22: మహానంది మండలం నందిపల్లె గ్రామంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ జిల్లా నాయకుడు యం.వి.రమణారెడ్డి, రైతు సంఘం నాయకులు వంగాల సాగేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో బుధ‌వారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక రైతుల జల చౌర్యంతో హెచ్ఎల్‌సి, ఎల్ఎల్‌సి, కెసి కెనాల్ ఆయకట్టుకు పూర్తిగా నీరు పారక ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కర్ణాటక రాష్టం అప్పర్ భద్ర ప్రాజెక్టును నిర్మిస్తూ రాయలసీమకు మరణశాసన రాస్తోందని, దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, ప్రజా ప్రతినిధులు నోరు విప్పి అన్ని వేదికల పై వ్యతిరేకిస్తూ, వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎగువ భద్ర ప్రాజెక్టును వ్యతిరేకిస్తూనే తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, ఆర్‌డిఎస్ కుడి వరద కాలువ, తుంగభద్ర దిగువ కాలువ సంరక్షణ కోసం వేదవతినదిపై ఎత్తిపోతల పథకం సాధించుకునేందుకు, గుండ్రవుల రిజర్వాయర్, సాధించుకోవాలని, కుంగిన అలగనూరు రిజర్వాయర్‌కు వెంటనే మరమ్మత్తులు చేసి కెసి కెనాల్ ఆయకట్టును కాపాడాలని, సిద్దేశ్వరం వద్ద కృష్ణానది పై తీగల వంతెన బదులు బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా ఒక్కటై రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన ఈ ఫిబ్రవరి 25వ తేదీ ఆర్‌డిఎస్ నుండి ఆదోని వరకు జరిగే రాయలసీమ రైతు ప్రజాపాద యాత్ర, ఫిబ్రవరి 28వ తేదీన ఆదోనిలో జరిగే రాయలసీమ ప్రజా ప్రదర్శన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో నందిపల్లె గ్రామస్తులు వీరశేఖరుడు, ఎస్. మాబాషా, యం.మోహన్, ఎస్.చంద్రశేఖరప్ప, కోటేశ్వరప్ప, ఎన్ రాము, లాల్ బాషా, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.