You are currently viewing రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టులే కీలక పాత్ర -ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టులే కీలక పాత్ర -ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 22: రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఎస్‌బిఐ కాలనీలోని శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల సెమినార్ హాలులో జర్నలిస్ట్ డిపార్ట్‌మెంట్ కోర్సు, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో సర్టిఫికేట్ కోర్సు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ పీజీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి, ప్రెస్ అకాడమీ సెక్రెటరీ బాలగంగాధర తిలక్, రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రతినిధి ప్రగతి, సీనియర్ జర్నలిస్టులు జనార్థ‌న్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిజం అనేది ప్రజలతో మమేకమై, అనేక సవాళ్లను ఎదుర్కొని అన్ని రంగాలకు సంబంధించిన వార్తలను సేకరించి ప్రచురించాల్సి ఉంటుందన్నారు. పరిశోధనాత్మక జర్నలిజం బాద్యతగా ఉండాలే కానీ లేని పక్షంలో సమాజానికి అనర్థం తెస్తుందన్నారు. అందుకే ఐదు మౌలిక సూత్రాలను ప్రముఖ పాత్రికేయులు ప్రతిపాదించారు. దీనికి ముందు ప్రతి వార్తలో ఉండవలసిన మరో ఐదు అంశాలు ఏమిటంటే ఏ వార్తకు అయినా ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి? ఎలా? ఎందుకు ? అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా వుంటేనే సమగ్రమైన వార్తగా పరిగణించ గలుగుతామన్నారు. ఇక జర్నలిజం ప్రాధమిక సూత్రాలలో ముఖ్యమైనది నిజానికే కట్టుబడి సమాచారంలో యాక్యురసీకి ప్రాదాన్యత ఇచ్చి జవాబుదారి తనంతో ఉండాలన్నారు. జర్నలిజం ప్రస్తుతం అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటోంది. ఇది ఒక ఇండియాకే పరిమితం కాదు. ప్రపంచం అంతటా ఈ సమస్య ఉంది. చైనా వంటి దేశాలలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏమి చెబితే అదే వార్త. అదే జర్నలిజం. ప్రజాస్వామ్య దేశాలలో కొన్ని చోట్ల పత్రికలపై ప్రభుత్వాల డామినేషన్ ఉంటే, మరికొన్ని చోట్ల పత్రికలు ప్రభుత్వాలను డామినేట్ చేయడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. అయినా జర్నలిజంలో విలువలు పాటించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఇది వారి వారి వ్యక్తిగత ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు. జర్నలిజంలో ఎన్నో రంగాలు పొలిటికల్ జర్నలిజం, జనరల్ జర్నలిజం, క్రైమ్ వార్తల జర్నలిజం, పరిశోధనాత్మక జర్నలిజం, స్పోర్ట్స్ జర్నలిజం, బిజినెస్ జర్నలిజం, మెడికల్ జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ జర్నలిజం ప్రతి రంగానికి సంబంధించి మెగజైన్లు వస్తున్నాయన్నారు. ఆయా రంగాలలో తమకు ఆసక్తి ఉన్నవాటిపై పట్టు సాధిస్తే ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు. ప్రభుత్వపరంగానే కాకుండా, ప్రైవేటు రంగంలో కూడా ఎన్నో అవకాశాలున్నాయన్నారు. జర్నలిజం చదివితే ఉద్యోగాలు రావేమోనన్న భయం ఉండవచ్చు కాని జాగ్రత్తగా ఇందులో మెలకువలను తెలుసుకోగలిగితే రాణించవచ్చని ఇందుకోసం కొన్ని ప్రత్యేక అర్హతలు పెంచుకోవాలని చైర్మన్ తెలిపారు. ముందుగా భాషపై పట్టు సాధించి, ఏదైనా కధనం రాస్తే అది చదివేవారిని కదలించేలా ఉండాలన్నారు. మన దేశ మాజీ ప్రధాని పివి.నరసింహారావు పద్నాలుగు భాషలు నేర్చుకుని పేరు గాంచారు. ఏ రంగంలో అయినా భాషా ప్రావీణ్యం అవసరమన్నారు. ప్రత్యేకించి తెలుగుతో పాటు ఆంగ్లం, హిందీ భాషలలో రాయడం, మాట్లాడడం. నేర్చుకోగలిగితే ఎంతో భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు హితవు చెప్పారు. ఇది కేవలం జర్నలిజం రంగంలోనే కాదు. ఇతర రంగాలలో కూడా ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కూడా విస్తారంగా ప్రచారంలోకి వచ్చాయన్నారు. కొన్నిసార్లు మెయిన్ మీడియా ఇవ్వని వార్తలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు వార్త తెలుసుకోవడానికి 24 గంటలు పట్టేది. ఇప్పుడు నిమిషం పట్టడం లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో మరెన్ని మార్పులు వస్తాయో తెలియదు. వీటి గురించి ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండాలన్నారు. ప్రెస్ అకాడమీ సెక్రెటరీ బాలగంగాధర తిలక్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టుకు ప్రశ్నించే తత్వంతో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలని, సమాజాభివృద్ధికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టులే ముఖ్య భూమిక పోషిస్తారన్నారు. బిఈడి, టిటిసిల మాదిరిగా జర్నలిస్టు కోర్సు ఉండదని, విభిన్న తరహాలో వుండే జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నత స్థితికి ఎదిగేందుకు చాలా అవకాశాలుంటాయన్నారు. రామకృష్ణ పీజీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగడానికి జర్నలిజం కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మొదటి విడత బ్యాచ్‌లో 40 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. జర్నలిజంతో పాటు మాస్ మీడియా కమ్యూనికేషన్ కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం కోర్సును యువత చక్కగా సద్వినియోగం చేసుకొని సమాజానికి ఉపయోగపడాలన్నారు. రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రతినిధి ప్రగతి మాట్లాడుతూ జర్నలిస్టుల వల్లే వేగంగా వార్తలు వస్తున్నాయన్నారు. జర్నలిజంతో పాటు వెబ్ జర్నలిజంలో కూడా ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.