You are currently viewing సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించండి -జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించండి -జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 14: సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా నిర్దేశించిన అభివృద్ధి గమ్యాలను చేరుకునేందుకు సంబంధిత అధికారులు చురుకుగా పనిచేసి రికార్డుల్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటనరీ హాలులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతిపై సిడిపిఓలు, విద్యా వైద్యాధికారులు ఏపీఎంలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సా6మూన్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించడం, ఆహారం, ఆరోగ్యం, అసమానతలను తగ్గించడం తదితర ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంపై సంబంధిత అధికారులు అత్యంత చురుకుగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలు డేటా ప్రకారం చూస్తే నమ్మశక్యంగా లేదని సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లలలో మిడుతూరు 59 శాతం, దొర్నిపాడు 54 శాతం మంది పిల్లలు బరువు, ఎత్తు తక్కువగా ఉన్నట్లు చూపుతున్నారని స్వయంగా పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలని ….. సంక్షేమ శాఖ పిడి లీలావతిని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే సమావేశానికి కూడా ఇలాంటి పనితీరు ప్రదర్శిస్తే సంబంధిత సిడిపిఓలను సస్పెండ్ చేసేందుకు వెనకాడమన్నారు. హైరిస్క్ గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను అధిగమించేందుకు స్వయం సహాయక బృందాలను వినియోగించుకుని అవసరమైతే అంగన్వాడి కేంద్రాల నుండి పోషకాహార పదార్థాలను చేరవేయాలన్నారు. హిమగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి న్యూట్రిషన్ స్క్రిప్షన్ స్పెషల్ ఇంటర్వెన్షన్ టైం టేబుల్ ప్రకారం పోషకాహారాన్ని అందించాలన్నారు. గ్రామ, మండల సమైక్య సంఘాలలో ఈ అంశాన్ని అజెండాగా పెట్టుకుని విస్తృత ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏ పీడి శ్రీధర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. 10-19 సంవత్సరాల మధ్య వయసుగల 35,371 మంది కౌమారదశ బాలికల్లో రక్తహీనత ఉన్నట్లు వైద్య రికార్డులో వెళ్లడైందని ఆశా, ఏఎన్ఎంల ద్వారా పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎంహెచ్ఓ వెంకటరమణను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఇతర సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్న 3800 మంది కౌమారదశ బాలికల్లో రక్తహీనత వైద్య పరీక్షలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎంహెచ్ఓను సంబంధిత వెల్ఫేర్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బడి బయట ఉన్న 7,716 విద్యార్థుల్లో 6981 మంది విద్యార్థులను పాఠశాలల చేర్పించినట్లు లెక్కలు చెబుతున్నారే తప్ప సరైన రికార్డులు చూపడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చే సమావేశానికి పూర్తిస్థాయిలో రికార్డులు చూపించాలని డిఈఓ అనురాధను ఆదేశించారు. రకరకాల కారణాలవల్ల 735 మంది పిల్లలు బడికి బయట ఉన్నట్లు చెబుతున్నారని, ఇందుకు సంబంధించిన కారణాలను అన్వేషించి అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈఓలను కలెక్టర్ ఆదేశించారు. రెండో దశ నాడు-నేడు కింద చేపడుతున్న పనులను ప్రతి సోమవారం సచివాలయ సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓ సుబ్బారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సిడిపిఓలు, ఏపీఎంలు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.