శాంతి రాం ఫార్మసీలో ఏడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ
నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 14: ప్రాంగణ ఎంపికల్లో తీవ్రమైన పోటీని ఎదుర్కోవడానికి, మీరు సిద్దంగా ఉన్నారా, ఇంటర్వ్యూ ప్రశ్నలను ఆత్మవిశ్వాసంతో సమాధానమిస్తారా? ఎంతో క్లిష్టమైన క్యాంపస్ సెలెక్షన్స్ విజయం సాధించేందుకు శాంతి రాం ఫార్మసీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వారంరోజుల నైపుణ్య శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. గుంటూరుకు చెందిన మెనువర్ క్యాంపస్ ట్రైనింగ్, ప్లేస్ మెంట్ సర్వీసెస్ ప్రతినిధి అక్బర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీ అంచనాలను బట్టి మీ అర్హతలను, నైపుణ్యాలను మీ రెజ్యూమ్‌లో హైలైట్ చేయడం ఎంతో కీలకమని తెలిపారు. అలాగే మీ సాంకేతిక సామర్థ్యాలను, సమస్య-పరిష్కార శక్తి, విమర్శనాత్మక ఆలోచన వంటి ప్రాథమిక నైపుణ్యాలను వ్రాత పరీక్ష ద్వారా కంపెనీలు అంచనా వేస్తాయని తెలిపారు. ఇక బృంద చర్చ అధికారిక ఇంటర్వ్యూలో కూడా కంపెనీలు మీ కమ్యునికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు అంచనా వేస్తాయని ఆయన విద్యార్థులకు వివరించారు. అలాగే సమయం పాలన, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ తదితర అంశాలపై కూడా కంపెనీలు అభ్యర్థుల తీరుతెన్నులు అంచనా వేస్తాయని తెలిపారు.