You are currently viewing మే 31 న జరిగే సిద్దేశ్వర జలదీక్షను విజయవంతం చేయండి

మే 31 న జరిగే సిద్దేశ్వర జలదీక్షను విజయవంతం చేయండి

  • Post category:Nandyal

శ్రీశైలం డ్యాంలో 60 టిఎంసి ల నీరు నిల్వ ఉండేటట్లుగా చూడాలన్న బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం డ్యాం అడుగు వరుకు నీటిని తోడేసి రాయలసీమకు బురదను మిగుల్చుతున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. మే 31న జరిగే సిద్దేశ్వర జలదీక్ష కార్యాక్రమంలో భాగంగా బుధవారం బండిఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం పట్ల రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, రాయలసీమ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తు తరానికి త్రాగడానికి కూడా నీరు లభించదని ఆవేదన వ్యక్తం చేసారు. రాయలసీమ ప్రాంతంలో 23 లక్షల ఎకరాలకు నీరు పారాల్సి వుండగా ,పాలకుల నిర్లక్ష్యంతో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు లభిస్తోందన్నారు. రాయలసీమ వినియోగించకొనలేని ఈ నీరంతా దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు చేరుతున్నదని అన్నారు. దీనితో కృష్ణా డెల్టా ప్రాంతానికి రబీ కాలంలో 37498 ఎకరాలకు నీరు పారాల్సి వుండగా 10 లక్షల ఎకారాలకు సాగునీరు, 3లక్షల ఎకరాల చేపల చెరువులకు వెరసి 13 లక్షల ఎకారాలకు నీరు పారించుకుంటున్నారన్నారు. రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మన నాయకులు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంతసేపూ పోలవరం , అమరావతి మీదనే కేంద్రీకృతమైనారు తప్ప కరువుతో అలమటిస్తున్న రాయలసీమ ప్రజానీకం పై సవతి ప్రేమను చూపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమ ప్రాంత సాగు, త్రాగునీటి కోసం మనమందరం 2016, మే 31 న సిద్దేశ్వరం అలుగు వద్ద ఎర్రటి ఎండలను, ప్రభుత్వ నిర్భందాలను లెక్కచేయకుండా సిద్దేశ్వర అలుగు ప్రజా శంఖుస్థాపన చేసామని దశరథరామిరెడ్డి గుర్తు చేసారు. 2016 సంవత్సరంలో వేలాదిమంది రైతులతో మనమంతా ఎక్కడైతే అలుగు ప్రజా శంఖుస్థాపన చేసామో ఇప్పడు కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సిద్దేశ్వరం దగ్గర వంతెన నిర్మాణం చేపడుతోందని, వంతెనతో పాటు అలుగు కూడా నిర్మించి రాయలసీమ ప్రజల నీటి కష్టాలను తీర్చాలని దశరథరామిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. ఇదొక మంచి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అలుగు నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంలోనే సిద్దేశ్వర అలుగు ప్రజా శంఖుస్థాపన ఆరవ వార్షికోత్సవం సందర్భంగా మే 31 న సిద్దేశ్వరం అలుగు దగ్గర జరగబోయే జలదీక్షకు ప్రజలంతా వేలాదిగా, వందాలది ట్రాక్టర్లలో తరలివచ్చి జలదీక్ష విజయవంతం చేయాలని దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వై.యన్.రెడ్డి, రామచంద్రారెడ్డి, మీనిగ రామేశ్వరరెడ్డి, న్యాయవాది శంకర్ రెడ్డి, మీనిగ నాగేశ్వరరెడ్డి, ఎంపిటిసి మల్లు శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ షబ్బీర్ అహ్మద్, ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచ్ నర్ల సుబ్బారెడ్డి, రేగటి శివరామిరెడ్డి, మీనిగ లక్ష్మీకాంతరెడ్డి, బూసిరెడ్డి , రాఘవరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.