You are currently viewing స్పందన వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టండి -జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

స్పందన వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టండి -జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 13: స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.నిశాంతితో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ స్పందన అర్జీదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్పందన కార్యక్రమంలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు గైకొని డిస్పోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని మండలాల్లో పెండింగులో వున్న కోర్టు కేసులను నేరుగా కౌంటర్ ఫైల్ చేయకుండా జిల్లా కేంద్రంలోని పైఅధికారుల ఆమోదం తీసుకొని కౌంటర్ ఫైల్ చేయాలన్నారు. అలాగే కోర్టు ఉత్తర్వులను కూడా వెంటనే అమలు పరచేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే వ్యతిరేక వార్తలపై కూడా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించి యాక్షన్ టెక్ అండ్ రిపోర్ట్ లు నాణ్యతతో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిఐపీఆర్ఓ జయరావును కలెక్టర్ ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు
1) బనగానపల్లె మండలానికి చెందిన మధుమోహన్ రెడ్డి తనకు పలుకురు గ్రామంలో సర్వే నంబర్ 252 నందు 1.229 హెక్టార్లు లీజుకు తీసుకున్నానని, అయితే సదరు లీజు నందు స్వామి నాయుడు, రామలక్ష్మి అనే వ్యక్తులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని గతంలో అనేక మార్లు అర్జీ ఇవ్వడం జరిగిందని, ఇదే విషయాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇతవరకూ చేయలేదని, నాకు లీజు ఉన్న ప్రాంతాన్ని సర్వే జరిపి స్వాధీన పరచవలసిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించుకున్నారు.
2) కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామానికి చెందిన షేక్ నసరుద్దిన్ తనకు సర్వే నంబర్ 213 విస్తీర్ణం 2 ఏకరాల 16 సెంట్లకు సంబంధించి కొంతమేర ఆక్షేపణ ఉన్నందున రెవెన్యూ అధికారులు ఆన్లైన్ నందు దానిపై రెడ్ మార్క్ వేసి ఉన్నారు. సదరు పొలంపై ఉన్న ఆక్షేపణకు సంబంధించి కోర్టును సంప్రదించగా అనుకూలంగా తీర్పు ఇచ్చారని రెవెన్యూ అధికారులు దానిని ఆన్లైన్ నందు రెడ్ మార్కును తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించుకున్నారు.
3) మిడుతూరు మండలం కడుమూరు గ్రామస్తులు గత 20 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వారు 400 పట్టాలు ఇచ్చారని కొంత మందికి పట్టాలు పోయాయని ఈ విషయంపై మండల అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని పట్టాలు పోయిన వారికి కొలతలు వేయించి ఎవరి స్థలం వారికి చూపించగలరని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో 185 మంది అర్జీదారులు తమ సమస్యలపై కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తులు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ వారు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.పుల్లయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.