నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 12: పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వున్న కారణంగా భారత ఎన్నికల సంఘం అనుమతి మేరకు నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ఈ నెల 13వ తేదీ స్పందన కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయుల, స్థానిక అధికారుల నియోజకవర్గాల ఓటర్లను ప్రభావితం చేసే సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోబడవని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి రేపు సోమవారం ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
