నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా 167 కే హైవే నిర్మాణంలో సిద్దేశ్వరం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ ఐకానిక్ బ్రిడ్జి ద్వారారాయల సీమ ప్రజలకు గాని, రైతులకు గాని ఎటువంటి లాభం ఉండదని ఐకానిక్ బ్రిడ్జి కాకుండా బ్రిడ్జి కం బ్యారేజ్ ని నిర్మించాలని కోరుతూ రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్దేశ్వరం కృష్ణానది బ్రిడ్జిపై ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల కేవలం టూరిజం డెవలప్మెంట్ అవుతుంది తప్ప రాయల సీమ రైతులకు, ప్రజలకు ఒరి గూరేది ఏమీ లేదన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కాకుండా బ్రిడ్జి కం బ్యారేజ్‌ను నిర్మించాలని కోరడం జరిగింది. బ్రిడ్జ్ కం బ్యారేజ్ నిర్మించడం ద్వార 70 టీఎంసీల నీటి నిల్వలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.. అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అప్రబద్ర ప్రాజెక్టును నిర్మించడానికి నిధులు మంజూరు చేశారని, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి సమస్య ఏర్పడుతుందని, ఈ ప్రాజెక్టును నిర్మించకుండా అడ్డుకోవాలని, సీఎంకు దృష్టికి తీసుకెళ్లాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కోరడం జరిగిందన్నారు. రాయలసీమ ప్రాంత రైతుల, ప్రజల నీటి కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సమస్యను తెలియజేస్తామన్నారు.
