-
గురువు సంకల్పం యువతకు ఉపాధి నెరవేరాలని వరుసగా ఏడవసారి మహా పాదయాత్ర
-
అనంతపురం టు శ్రీశైలం పాదయాత్ర చేస్తున్న పెరుమాళ్ళ జీవానంద రెడ్డి
నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 11: ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు మహాశివుని దర్శనానికి పోటెత్తుతారు. ఎన్నో వేల మంది భక్తులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి కూడా శ్రీశైలంకు వందల కిలోమీటర్లు కాలినడకన చేరుకొని మహాశివుని దర్శించుకుని పునీతులు అవుతారు. అనంతపురం నుండి చార్టర్ అకౌంటెంట్ పెరుమాళ్ళ జీవానంద రెడ్డి వరుసగా ఏడోసారి అనంతపురం నుండి శ్రీశైలంకు కాలినడకన 200 మంది తన బృందంతో శనివారం నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో బస చేశారు. ఈ సందర్భంగా స్వామిని ప్రభ న్యూస్ పలకరించగా తన గురువు శ్రీ కైలాసశ్వర స్వామి మహిమాన్వితమైన నవ పాషాణ లింగాన్ని అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద గల కియా కార్ల పరిశ్రమల సమీపంలో ఉన్నశ్రీ కైలాసంలో ప్రతిష్టించాలని సంకల్పించారన్నారు. నవ పాషాణ లింగం సహజమైన మూలికా వస్తువులతో ఎన్నో వ్యయ ప్రయాసాలతో సంవత్సరాలుగా తయారు చేయబడుతుందన్నారు. ఈ నవ పాషాణ లింగం పై అభిషేకం చేసిన వాటిని సేవించిన వారికి అన్ని రోగాలను దూరం చేసే శక్తి ఉన్నట్లు సైంటిఫిక్‌గా నిరుపతమైందన్నారు. అంతే కాకుండా దీని ప్రతిష్ట ద్వారా లోకకల్యాణం సిద్ధిస్తుందని గురువు కైలాసశ్వర స్వామి అభీష్టమన్నారు. రాష్ట్రంలో యువత ఉపాధి లేకపోవడంతో తల్లిదండ్రులను విడిచి ఎక్కడో దూరప్రాంతాలలో నివసిస్తున్నారన్నారు. అందువల్ల మండల స్థాయిలో పరిశ్రమలు రావడం వలన ఇక్కడే ఉపాధి లభించి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారని, ఈ కోరిక నెరవేరాలని మూడు సంవత్సరాలుగా శివదీక్షలోనే కొనసాగుతూ వరుసగా ఏడవసారి శ్రీశైలంకు అనంతపురం నుండి నడిచి వెళ్లి మహాశివుని దర్శించుకుంటున్నామన్నారు.
మహా శివలింగానికి గ్రామ గ్రామాన హారతులు
పాదయాత్రలో 108 శివలింగాలను కలిపి ఒక ఏడడుగులు గల ఏడు టన్నుల మహాశివలింగాన్ని ట్రాక్టర్‌లో ఉంచి ఊరేగింపుగా తీసుకొని వెళుతున్నారు. దీంతో అనంతపురం నుండి శ్రీశైలం వెళ్లే దారి పొడుగునా గ్రామ గ్రామంలో ఈ శివలింగానికి హారతులు పడుతూ జనాలు పూజలు చేస్తు జీవానంద రెడ్డి స్వామి ఆశీస్సులను అందుకుంటున్నారు. ఈ శివలింగాన్ని శ్రీశైలం చేరుకున్న అనంతరం పురవీధులలో ఊరేగింపు చేసి ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ కైలాసంలో ప్రతిష్టింప చేస్తారు.