నంద్యాల (బిఎన్ న్యూస్) ఫిబ్రవరి 10: పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆర్డీఓలు, తహసీల్దార్లు ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పటిష్ట నిర్వహణపై జాయింట్ కలెక్టర్ టి. నిశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 641 క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్లను వెంటనే పరిశీలించి ఓటర్ల జాబితాలో పొందుపరచాలన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో డూప్లికేషన్, అర్హత లేని వారుంటే వెంటనే తొలగించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు పరిచేందుకు ప్రతి మండలంలో ఎంసిసి టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి సిబ్బంది వివరాలు తెప్పించుకొని ఎన్నికల విధులు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఖజానా శాఖ డిడి, కలెక్టరేట్ ఏఓను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సరళిపై సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులపై పరిశీలించాలని కలెక్టర్ సంబంధిత మండల తహసీల్దార్లను ఆదేశించారు. స్ట్రాంగ్ రూము, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కౌంటర్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి వీడియోగ్రాఫర్, సూక్ష్మ పరిశీలకులను నియమించాలన్నారు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులకు కేటాయించిన విధులను నిర్వర్తించాలన్నారు.
