You are currently viewing జిల్లాలోని వ్యవసాయ ఎరువుల టోకు వ్యాపారుల అనుమతులు రద్దు

జిల్లాలోని వ్యవసాయ ఎరువుల టోకు వ్యాపారుల అనుమతులు రద్దు

పట్టణంలోని వ్యవసాయ ఎరువులను టోకుగా అమ్మే వ్యాపారస్తుల అనుమతులు రద్దు చేస్తూ వ్యవసాయ అధికారి టి.మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా గత కొన్ని రోజులుగా జిల్లాలో వ్యవసాయ ఎరువుల సరైన ధ‌రకు లభించక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్న విషయం రైతులు తమ అసహనాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తూ పత్రికల ద్వారా సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం కల్పించడం జరిగింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి తక్షణమే టోకు వ్యాపారుల పైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్.మనజీర్ జిలాని సామును ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, నంద్యాల ఆర్డీవో శ్రీనివాస్ తదితర అధికారులు పలు వ్యాపార సముదాయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగినది. తనిఖీలలో భాగంగా వ్యాపార నిర్వహణలో అవకతవకలను గుర్తించి నివేదికను సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. నివేదిక ఆధారంగా సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్.మనజీర్ జిలాని సామున్ సంబంధిత వ్యాపారస్తుల వ్యాపార అనుమతులను రద్దు పరచమని జిల్లా వ్యవసాయ అధికారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని 1.దియ్యాల మధు సూదన్ రావు, 2.ఎన్.రామకృష్ణ రెడ్డి, 3.జెవిసి రసాయనాలు, ఎరువులు, 4.మురళి ఎంటర్‌ప్రైజెస్ అను టోకు దుకాణాల అనుముతులను రద్దు చేస్తూ జిల్లా వ్యవసాయ అధికారి టి మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ తమ పరిధిలోకి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి తగు చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లా వ్యవసాయ శాఖలోని అధికారులు అందరూ రైతులకు ఉపయోగపడేలాగా తమ విధులు నిర్వహించాలని ఉపదేశం చేశారు. ఫిర్యాదులు వస్తేనే చర్యలు తీసుకుంటామని నిమ్మకు నీరు ఎత్తినట్లుగా ఉండకుండా వ్యవసాయ అధికారులు అందరూ తమ తమ పరిధిలోని వ్యాపార కేంద్రాలను త‌ర‌చూ తనిఖీలు చేస్తూ దస్త్రాలను పరిశీలిస్తూ వ్యాపార వ్యవహారాల అవకతవకలను గుర్తిస్తూ విధులు నిర్వహించాలని స్పష్టంగా తెలియజేశారు.