You are currently viewing గృహ లబ్ధిదారుల నుండి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్‌లు సేకరించాలి

గృహ లబ్ధిదారుల నుండి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్‌లు సేకరించాలి

  • Post category:Nandyal

ఇళ్ల పట్టాలకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే భూసేకరణ చేయండి

స్పందన వినతులపై ప్రత్యేక దృష్టి సారించండి

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

జిల్లాలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన గృహ లబ్ధిదారుల నుండి ఫోటోతో కూడిన డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ లు సేకరించాలని ఆర్డీఓలు, మండల త‌హ‌సీల్దార్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్ఎఆర్ఎస్‌) వైఎస్సార్ సెంటినరీ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య తదితర జిల్లాధికారులు నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ సిసిఎల్ఎ ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన లబ్ధిదారుల నుండి ఫోటోతో కూడిన డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్లను ఈ నెల 18వ తేదీలోగా సేకరించి పంపాలని ఆర్డీఓలు, మండల త‌హ‌సీల్దార్లను ఆదేశించారు. 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కింద జిల్లాలో దాదాపు 55 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల మేరకు సంబంధిత గృహ లబ్ధిదారుల నుండి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ పొందాలన్నారు. ఇందుకోసం తమ పరిధిలోని వీఆర్వోలు, వాలంటీర్ల ద్వారా డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి ఈనెల 18వ తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉందని, లబ్ధిదారులకు పొజిషన్ మాత్రం చూపలేదని గత డిఆర్సి సమావేశంలో ఎమ్మెల్యేలు కూడ తమ దృష్టికి తీసుకొచ్చారని…అలాగే ప్రభుత్వం నుండి కూడా ఆదేశాలు వున్న నేపథ్యంలో ఇళ్ల పట్టాల అక్కనాలెడ్జ్మెంట్ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల పట్టాల మంజూరుకు సంబంధించి ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు అందుబాటులో లేకపోతే ప్రైవేట్ భూములను గుర్తించి ఈ నెల 31వ తేదీలోగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే హౌసింగ్ కాలనీలకు సంబంధించి 14 కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయని గవర్నమెంట్ ప్లీడర్ తో సంప్రదించి కోర్టు కేసులను క్లోజ్ గా మానిటర్ చేయాలని త‌హ‌సీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో స్వీకరించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల్లో అన్ని సర్వీసులకు సంబంధించి 186 వినతులు బియాండ్ ఎస్ఎల్ఏ లో వున్నాయని వెంటనే పరిష్కరించాలన్నారు. స్పందన రీఓపెన్ కేసులకు సంబంధించి సేమ్ ఎండార్స్మెంట్ ఇవ్వకుండా సీరియస్ గా తీసుకొని బాధ్యతాయుతంగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. వివిధ కోర్టులలో పెండింగులో వున్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలపై వెంటనే స్పందించి స్వయంగా పరిశీలించి రీజాయిన్డెర్ లు పంపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు: బేతెంచెర్ల మండల నివాసి రామాంజనేయులు తనకు రెండు చెవులు వినపడవని… వికలాంగత్వ సర్టిఫికెట్ 20శాతం ఇచ్చారని తనకు 75శాతం వికలాంగత్వ సర్టిఫికెట్ మంజూరు చేసినట్లయితే వికలాంగుల పెన్షన్ కు అర్హుడవుతానని…సదరం క్యాంపు ద్వారా సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించుకున్నారు. ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామ నివాసితుడు రామకృష్ణ సర్వేనెంబర్ 457/2 లో 2.50 ఎకరాల పొలం సాగు చేసుకుంటున్నానని ప్రక్క పొలం వ్యక్తి పూర్వం నుండి వస్తున్న వాగుకు అడ్డుకట్ట వేసి తన పొలంలోకి నీటిని పంపిస్తున్నారని తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించుకున్నారు. బనగానపల్లె మండలం రామతీర్థ గ్రామ నివాసి వినోద్ కుమార్ తన తండ్రి గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ గా పనిచేసి గుండెపోటుతో మరణించారని… కారుణ్య నియామకం కింద తనకు వీఆర్ఏ పోస్ట్ మంజూరు చేశారని… అయితే తాను బీటెక్ చదువు పూర్తి చేశానని అర్హత మేరకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో 241 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతి పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఆర్ఏఆర్ఎస్ ఆడిటోరియం ఆవరణంలో ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి కింద ఎస్ సి కార్పొరేషన్ ద్వారా 2018-19 సం.నకు గాను మెకనైజ్డ్ డ్రైక్లిన్ ట్రాక్టర్ ను చాగలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు కలెక్టర్ పంపిణీ చేశారు. ట్రాక్టర్ విలువ 15 లక్షలు ఇందులో సబ్సిడీ 5.25 లక్షలు వుందని ఎస్ సి కార్పొరేషన్ అధికారి విజయలక్ష్మి కలెక్టర్ కు నివేదించారు.