-ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్
ఎస్సీ ఎస్టీ చట్టాలను నిర్వీర్యం చేయకుండా పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ పేర్కొన్నారు.
నంద్యాల పర్యటనకు వచ్చిన ఎస్టీ కమిషన్కు అధికారులు నాయకులు ప్రజాసంఘాల నాయకులు స్వాగతం పలికారు. గడివేముల మండలం ఎల్కేతాండ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ, డిఎస్పీ, ఆర్డీవో సమక్షంలో గ్రామస్తులతో విచారణ చేపట్టారు. తండాలో ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు ప్రజాసంఘాల నాయకులు వందలాదిమంది వచ్చి కమిషన్కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాల న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ గిరిజనులకు భరోసా కల్పించారు. నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా ఎస్పీ రఘువీరా రెడ్డి అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ గిరిజనుల కోసం నిష్పక్షపాతంగా పర్యటన చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ కమిషన్ ప్రత్యక్షమవుతుందన్నారు. దీనిలో భాగంగా నిరుద్యోగ సమస్యలు నిర్మూలించాలని, గిరిజన కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, మెరుగైన విద్యా, వైద్యం రాష్ట్రంలోని గిరిజనులకు కల్పించాలని కమిషన్ ప్రాధాన్య క్రమంలో పనిచేస్తుందన్నారు. నిజమైన గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేసి వారికి న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా తండాలలో నాటు సారా విక్రయించరాదని, అది చట్టారీత్యా నేరమని అన్నారు. గిరిజనులు ఐక్యమత్తంగా ఉండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్ టి లకు రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించి వారి జీవన ప్రమాణాలను కృషి చేయాలని అధికారులను కోరారు. జిల్లాలో గిరిజనుల పైన ఎక్కడ దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో గిరిజనులు వారికి సంబంధించిన సమస్యలపై అధికారులు ఫిర్యాదు చేస్తే అధికారులు సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో అట్టి అధికారులపై కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, డి.ఎస్.పి మహేశ్వర రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో శ్రీనివాసులు పాణ్యం సీఐ, నంద్యాల టూ టౌన్ సిఐ, ఎస్ఐ సురేష్, గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్,అధికారులు పాల్గొన్నారు.