రీఓపెన్ అవుతున్న దరఖాస్తులపై ప్రత్యేక శిక్షణ
-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల రిజిస్ట్రేషన్, పరిష్కార నాణ్యత తదితర అంశాలలో సంపూర్ణ శిక్షణ పొంది అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. మంగళవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్ఎఆర్ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాల్‌లో స్పందన వినతుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై ఒక రోజు స్పందన వర్క్ షాప్ జరిగింది. ఈ వర్కుషాప్ లో జిల్లా కలెక్టర్ తో పాటు డిఆర్ఓ పుల్లయ్య, విజయవాడ నుండి వచ్చిన స్పందన సాంకేతిక నిపుణులు శ్రీనివాసులు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో స్వీకరించిన వినతులకు నాణ్యమైన పురస్కారం అందించేందుకు రాష్ట్రస్థాయి నుండి సాంకేతిక నిపుణుల బృందం వచ్చిందని దరఖాస్తుల రిజిస్ట్రేషన్ మొదలుకొని క్లోజ్ చేసేంతవరకు అన్ని స్థాయిల్లో సంపూర్ణ శిక్షణ పొంది అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. నంద్యాల జిల్లా అయిన తర్వాత నిర్ణీత కాల పరిమితిలోగా స్పందన సమస్యలను ఎలా పరిష్కరించాలి, క్వాలిటీగా ఎలా డిస్పోజ్ చేయాలి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పందనకొచ్చిన దరఖాస్తులకు సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లే దాదాపు పది శాతం వినతులు రీఓపెన్ అవుతున్నాయన్నారు. రీఓపెన్ అయిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ పరిధిలో పరిష్కరించదగ్గ సమస్యలకు సత్వరమే చర్యలు గైకొని సంబంధిత ఫోటోలు అప్లోడ్ చేసి క్లోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లిప్తంగా ఉన్న ప్రతికూల దృక్పథాన్ని మార్చుకొని నాణ్యతగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దిగువస్థాయిలో చిన్న పొరపాట్లు దొర్లినా పెద్ద అవాంతరాలకు దారి తీస్తుందని ఈ మేరకు ప్రతి ఒక్కరు స్పందన ఫిర్యాదుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. హడావిడిగా కాకుండా, సేమ్ ఎండార్స్మెంట్ ఇవ్వకుండా, ప్రతి అధికారి ప్రతిరోజు కనీసం అరగంట సమయాన్ని స్పందన కార్యక్రమానికి వెచ్చించి లాగిన్ అయి దరఖాస్తుల పరిష్కారం పై శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన అర్జీలకు సపోర్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేకపోవడం వల్లే దరఖాస్తులు రీఓపెన్ అవుతున్నాయని వీటిని ఏ విధంగా పరిష్కరించాలి. ఎన్ని రోజులు రిప్లై ఇవ్వాలి తదితర అంశాలపై పూర్తిస్థాయి శిక్షణ పొంది క్వాలిటీ డిస్పోజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రాష్ట్రస్థాయి స్పందన సాంకేతిక నిపుణులు శ్రీనివాసులు, హేమంత్ లు స్పందన కార్యక్రమంపై శిక్షణ ఇస్తూ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు లేవలెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.