నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో భారతరత్న డాక్టర్. బి.సి.రాయ్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని లయన్స్ క్లబ్ జాతీయ వైద్యుల దినోత్సవ పురస్కారాలను వైద్యులకు అందజేసి ఘనంగా సత్కరించారు. బీ.సీ.రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నంద్యాల జిల్లా డి.సీ.హెచ్.ఎస్. డాక్టర్ జఫ్రుల్ల,తిమ్మాపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి. చంద్రశేఖర్, నంద్యాల ప్రభుత్వ ప్రసూతి స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ రాధికా జ్యోతి, ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ వసుధ, ప్రముఖ అనస్తీసియా వైద్య నిపుణులు డాక్టర్ మాధవి జాతీయ వైద్యుల దినోత్సవ లయన్స్ క్లబ్ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కనిపించే దేవుళ్ళు వైద్యులు అని ప్రశంసిస్తూ, ఆరోగ్య విపత్తు సమయాల్లో వైద్యులు అన్నివేళలా, కరోనా లాంటి సమయాల్లో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వారి సేవలు అందించి ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. నంద్యాల వైద్యులు కేవలం వైద్యం అందించడమే కాకుండా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్యుల కు ప్రజలకు మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, ఒక్కోసారి వైద్యుల ప్రయత్నాలు ఫలించక రోగులు మరణిస్తే వైద్యులపై, ఆసుపత్రులపై దాడులు జరిగే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అటువంటి సమయాలలో ప్రజలు సమయమనం పాటించి సహకరించాలని కోరారు. అదే విధంగా వైద్యులు కూడా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని, నిరంతరం తమ వైద్య విజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటూ ఉన్నత స్థాయి వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ సహదేవుడు డాక్టర్ బి సి రాయ్ జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్, కూరా ప్రసాద్, కోశాధికారి రత్న, కార్యక్రమ స్పాన్సర్ మహేశ్వరరెడ్డి, ప్రాంతీయ చైర్మన్ కసెట్టి చంద్రశేఖర్, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు ఆంజనేయులు గుప్తా, వేణుమాధవ్, స్వామి రెడ్డి, భవనాసి మహేష్, మనోహర్ రెడ్డి, రమేష్, ఇమ్మడి రామకృష్ణ, పోసిన సుబ్బారావు, రమణయ్య, యూసఫ్,దానాల రవి కాంత్, నిజాముద్దీన్,కిషోర్,భరత్, ఉపేంద్ర,సుజిత్,రాజ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
- Post published:July 2, 2022
- Post category:Nandyal