You are currently viewing వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలి

వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలి

  • Post category:Nandyal

-రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి

వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించి లాభసాటిగా తీసుకురావడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆశయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్ఏఆర్ఏస్‌) వైఎస్సార్ సెంటినరీ హాలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మార్కుఫెడ్ చైర్మన్ పి.పి. నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రైతుల కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి షెడ్యూల్ ప్రకారం అమలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా పెట్టుబడి నిధి కింద దాదాపు 23 వేల కోట్ల రూపాయలను 52 లక్షల మంది రైతుల ఖాతాలకు జమచేసిందన్నారు. ఈ-క్రాఫ్ ప్రీమియం క్రింద 6,684 కోట్లు పంపిణీ చేసిందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందించడంతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రిజర్వాయర్లలో నీటిని నిల్వ ఉంచి కాలువల ద్వారా చివరి ఆయకట్టు భూముల వరకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి చర్చలు నిర్వహించి రైతులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రైతుల కోసం ఏ రాష్ట్రంలో జరిగనన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సహాయకులచే అధిక పంట దిగుబడులపై రైతుల్లో అవగాహన కల్పించడంతోపాటు రసాయనిక ఎరువులు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అర్హులైన రైతులందరికీ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ముఖాముఖి చర్చా కార్యక్రమంలో రైతులు సభ దృష్టికి తెచ్చిన సమస్యలకు వ్యవసాయం, ఉద్యాన, సూక్ష్మసేద్యం, సీడ్ కార్పొరేషన్, మార్క్ఫెడ్, ఏపీఎస్పీడీసీఎల్ తదితర సంబంధిత అధికారులతో సందేహాలను నివృత్తి చేయించారు. ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా పంటలు వేసుకునేలా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులను సూచించారు. నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని రసాయనిక ఎరువులు వినియోగించకుండా సహజసిద్ధ ఎరువులతో పంటలు ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైతు పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే అధిక లాభాలు వస్తాయని ఈ మేరకు రైతులను ప్రోత్సహించాలని ఆయన రైతు సంఘాల నాయకులను కోరారు. జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ వైస్ చైర్మన్లు రైతుల చెంతకు వస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అర్థమవుతుందన్నారు. రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు వెల్లడించిన విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అపోహలు ఉన్నాయని ప్రభుత్వమే ఏదేని గ్రామంలో 5 ఎకరాలు లీజుకు తీసుకొని సహజ సిద్ధ ఎరువులతో దిగుబడులు సాధించి రైతుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. క్రాఫ్ ఇన్సూరెన్స్ అందని రైతులను గుర్తించి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కుఫెడ్ చైర్మన్ పి.పి. నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి రైతులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం నిర్వహించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల ద్వారా జొన్న మరియు పసుపు ఉత్పత్తులను జూలై 4వ తేదీ నుండి గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. ఈ క్రాఫ్ బుకింగ్ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అనంతరం అతిధులు వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, ఉద్యాన శాఖ అధికారి రమణ, పశుసంవర్ధక శాఖ జెడి రమణయ్య, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.