-జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య
జాతీయ రహదారులు 340సి, 167కె లకు సంబంధించి భూసేకరణను త్వరితగతిన పూర్తిచేసి సంబంధిత నివేదికలు ఇవ్వాల్సిందిగా జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మండల తాసిల్దార్లు, నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నేషనల్ హైవే భూసేకరణ ప్రగతిపై సంబంధిత అధికారులు, మండల తాసిల్దార్ లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ జాతీయ రహదారి 340కి సంబంధించి నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో చేపట్టిన భూసేకరణలో స్ట్రక్చర్ వాల్యూలను లెక్కకట్టి రెండు వారాల్లో నివేదికలు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఇందుకోసం నేషనల్ హైవే థర్డ్ పార్టీ ఏజెన్సీ, మండల సర్వేయర్లు, తాసిల్దార్లు కోఆర్డినేట్ అయి భూ సేకరణలో కోల్పోయిన ఇళ్లు, వాణిజ్య చెట్లు, బోరు బావులు, మోటార్లు తదితర నిర్మాణాల విలువలను లెక్క కట్టి నివేదికలను అందజేయాలన్నారు. నివేదికలు అందజేసిన వెంటనే సంబంధిత ప్రతిపాదనలు అవార్డు దశకు చేరుకుంటాయని ఆమె తెలిపారు. అలాగే 167 కే జాతీయ రహదారి సంబంధించి కొత్తపల్లి, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, నంద్యాల వరకు సర్వేనెంబర్ లో ఏయే గ్రామాల్లో ఎంత విస్తీర్ణం భూసేకరణకు అవసరమవుతుందో గుర్తించి సంబంధించిన ప్రతిపాదనలను వచ్చే నెల 15వ తేదీలోగా సమర్పించాలని ఆమె సంబంధిత మండల తాసిల్దార్లను, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. నివేదికలో అందిన వెంటనే నేషనల్ హైవే అధికారులకు గజిట్ నోటిఫికేషన్ కు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ అధికారులు, సంబంధిత మండల తహసీల్దార్లు, ఆర్అండ్బి అధికారులు, జాతీయ రహదారుల డిటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.