నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్దగల పోలీస్ కార్యలయంలో ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి నంద్యాల జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ లకు సంబంధించి దశలవారిగా నేరసమీక్ష సమావేశాలు నిర్యాహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు.స్టేషన్ లలో ఉన్న లాంగ్ పెండింగ్ కేసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాంగ్ పెండింగ్ ప్రాపర్టీ కేసులు (రాబరీ, డకాయిట్ ) వివరాలు తెలుసుకొని వాటికి సంబంధించిన ముద్దాయిలు ఎవరో కనిపెట్టి విచారణ జరిపి దర్యాప్తు త్వరితగతిన ముగించి ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. మర్డర్ కేసులు, ఫోక్సో కేసులు మొదలగు తీవ్రమైన నేరాల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్ షీట్లు వెయ్యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని వారి రక్షణకు సంబంధించి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన దిశ యాప్ పట్ల అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని సారా తయారీకి కావలసిన బెల్లం విక్రయదారుల పై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మట్కా,జూదం, క్రికెట్ బెట్టింగ్, గుట్కా మొదలగు అసాంఘిక కార్యకలాపాలఫై ప్రత్యేక నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల పై ప్రత్యేక దృష్టి ఉంచాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు (సిగ్నల్స్ )ఏర్పాటు చేయాలని,ప్రమాదాల నివారణకు కావలసిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలన్నారు. ఎస్.హెచ్.ఆర్.సి., ఎన్.హెచ్.ఆర్.సి, ఉన్నతాధికారుల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
