- రీసర్వే, భూసేకరణ పనులు వేగవంతం చేయండి
- ఆర్దీఓలు, తహసీల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆన్లైన్లో వ్యక్తుల భూ మార్పుల దిద్దుబాటుకు సంబంధించి మ్యుటేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మండల తహసీల్దార్లు, ఆర్దీఓలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్యతో కలిసి మ్యుటేషన్, ఓటిఎస్, హౌసింగ్, రీ సర్వే, భూసేకరణ తదితర రెవెన్యూ అజెండా అంశాలపై మండల తహసీల్దార్లతో కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు శ్రీనివాసులు, వెంకట రెడ్డి, ఎంకె దాసు, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ మ్యుటేషన్ కరెక్షన్స్ కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు బియాండ్ సబ్ ఎస్ఎల్ఎకు వెళ్లకుండా నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని మండల తాసిల్దార్ లను ఆదేశించారు. మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టి పూర్తి చేయించాలని ఆర్డీఓలను ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైమ్ సెటిల్మెంట్ కు సంబంధించి పెండింగ్ లో వున్న 4109 గృహాలకు రిజిస్ట్రేషన్, స్కానింగ్ తదితర వంటివన్నీ పూర్తి చేయాలని మండల తాసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జగనన్న భూ హక్కు భూ రక్షా పథకం కింద మొదటి విడత పెండింగ్లో వున్న147 గ్రామాల్లో రీ సర్వే పనులు వేగవంతం చేసి ప్రతిరోజు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ మేరకు నివేదికలను సంబంధిత ఆర్డీవోల ద్వారా జేసీ కార్యాలయానికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన రెవెన్యూ సర్వీసుల క్లియరెన్స్ కు సంబంధించి 63 పెండింగ్లో ఉన్నాయని బియాండ్ ఎస్ఎల్ఎ కు వెళ్లకుండా సంబంధిత ఫిర్యాదులు మీవిగా భావించి త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలన్నారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లకు పెండింగ్‌లో ఉన్న 17 మండలాల్లో అవసరమైన స్థలాలను గుర్తించి వచ్చే సోమవారం లోపు సంబంధిత ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథక ప్రగతిపై మండలాల వారీగా కలెక్టర్ ఆరా తీస్తూ సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారుల గృహాలు కూడ పూర్తి కాకపోవడానికి గల కారణాలేంటని కలెక్టర్ తహశీల్దార్లను ప్రశ్నించారు. గృహ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని విడనాడి చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓలు, మండల తాసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి ఇళ్ల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రతిరోజు సమీక్షిస్తూ పురోగతిని పెంచాలన్నారు. జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి భూసేకరణ ఏ ఏ మండలాల తహసీల్దార్ల వద్ద పెండింగ్ ఉందో వాటన్నింటినీ పూర్తి చేసి సంబంధిత ప్రతిపాదనలు పంపాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.