You are currently viewing ఎస్సీ ప్రజల అభ్యున్నతికై ఎస్సీ కమీషన్

ఎస్సీ ప్రజల అభ్యున్నతికై ఎస్సీ కమీషన్

  • Post category:Nandyal

అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి పోలీస్, రెవెన్యూ అధికారులు సమిష్టి కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు కట్టేపోగు బసవరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎస్సీ కమీషన్ సభ్యులు పత్రికా విలేఖరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టి,అణగారిన వర్గాల ప్రజలపై దాడులు నిర్వహించినా, ఆస్తులు ఆక్రమించుకున్న సంబంధిత వర్గాల వారికి ధర్మబద్ధంగా న్యాయం చేసి వారి సంక్షేమానికి తోడ్పాటు అందించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పోలీసు, రెవెన్యూ అధికారులను కోరామన్నారు.ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల వారికి అన్యాయం జరక్కుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమీషన్ ను ఏర్పాటు చేసిందని ఈ మేరకు వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంచిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో అదే స్థాయిలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు కూడా వెంటనే స్పందించి నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా న్యాయం చేయాలని కోరారు. శిరివెళ్ల మండలం చెన్నూరు గ్రామ ఎస్సీ బిడ్డలతో మమేకమై వాళ్ల సాధక బాధలు, జీవన విధానం తెలుసుకునేందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సి కుటుంబాలకు అన్యాయం జరిగిన పోలీస్, రెవెన్యూ సంబంధిత అధికారులు సహకరించకపోయినా సంబంధిత వ్యక్తులపై కమిషన్ తీవ్ర చర్యలు తీసుకుంటుందని అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడదని సభ్యులు తెలిపారు. అత్యాచారం జరిగిన, ఆస్తులు దురాక్రమణకు గురైనా రాజకీయ ఒత్తిళ్లు, అవినీతికి పాల్పడకుండా వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ఎస్సీ వర్గాల సంక్షేమానికి సంపూర్ణ తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు, డిఎస్పి మహేశ్వరరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి చింతామణి తదితరులు పాల్గొన్నారు.