నంద్యాల ఐఎమ్ఎ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ లో గురువారంపురపాలక పారిశుద్ధ్య మహిళా కార్మికులకు, పురపాలక మహిళా సిబ్బందికి, వార్డు సచివాలయ మహిళా సిబ్బందికి మల్టీ స్పెషాలిటీ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. 20 మంది మహిళా వైద్యులు శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఐఎంఏ మహిళా విభాగం నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ నిర్వహణలో జరిగిన ఈ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా, కమిషనర్ వెంకట కృష్ణ, రాష్ట్ర ఐఏమ్ఏ అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎమ్ఎ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. చైర్ పర్సన్ మాబున్నీసా రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా శిబిరాన్ని ప్రారంభించారు. మాబున్నీసా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించిన వైద్యులను అభినందించారు. నంద్యాల ఐఎమ్ఏ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రతి నెల వివిధ శాఖల సిబ్బందికి, పట్టణంలోని పేదలు ఎక్కువగా ఉన్న వార్డులలో, సమీప గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో మహిళా వైద్యులు నర్మద, వసుధ, హరిత, కవిత, నాగ రేఖ, చంద్రకళ, లక్ష్మీ ప్రసన్న, పెసల సునీత, శశికిరణ్, స్ఫూర్తి రెడ్డి, సునీత, మాధవి, లలిత, కిరణ్మయి, క్రాంతి, స్రవంతి, ఎముకల నిపుణులు జగన్ మోహన్ రెడ్డి తదితర వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు.
