You are currently viewing ప్రయారిటీ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

ప్రయారిటీ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

  • Post category:Nandyal

సిమెంట్ కొరత లేదు., నిధుల కొరత లేదు., నిర్మాణాల్లో ఆలస్యమైతే సంబంధిత ఇంజినీర్ల పై తీవ్ర కఠిన చర్యలు

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రయారిటీ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై తీవ్ర కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ హెచ్చరించారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్‌.ఎ.ఆర్‌.ఎస్‌) వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రయారిటీ భవనాల నిర్మాణాలపై మండలాల వారీగా క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రయారిటీ బిల్డింగుల నిర్మాణాల్లో నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత ప్రధాన ముఖ్య కార్యదర్శులు ప్రయారిటీ బిల్డింగుల నిర్మాణాల వేగవంతంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, ఎంపీడీవోలు ప్రత్యేక ఫోకస్ పెట్టి రోజురోజుకు ప్రగతి కనపరచాలన్నారు. ఇంకా ప్రారంభం కాని 28 గ్రామ సచివాలయ భవనాలు, 106 రైతు భరోసా కేంద్రాలు, 78 వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను మూడు రోజుల్లో బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. జయజ్యోతి, కెసిపి, జువారి, రెయిన్ సిమెంట్ సంస్థలు తమ ఇండెంట్ లో 35 శాతం సరఫరా చేసాయని సిమెంట్ కొరత లేనప్పటికి నిర్మాణ పనులపై శ్రద్ధ చూపకుండా కథలు చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం 700 మెట్రిక్ టన్నుల సిమెంట్ సిద్ధంగా వుందని ప్రతిరోజు ప్రతి బిల్డింగ్ లో పనులు జరగాలని… మొక్కుబడి రీతిలో కారణాలు చెబితే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాలో తయారయ్యే సిమెంట్ సంబంధిత ఫ్యాక్టరీలు ఇండెంట్ ప్రకారం ఇక్కడే తొలుత సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ ను కలెక్టర్ ఆదేశించారు. సిమెంట్ లేదని ఇంజనీరింగ్ అధికారుల నుండి ఫిర్యాదులు వస్తే పరిశ్రమల శాఖ డిడినే భాద్యుడ్ని చేస్తామని ఆయన స్పష్టం చేసారు. ప్రయారిటీ భవన నిర్మాణాలకు సిమెంట్ కొరత లేదు… నిధుల కొరత లేదని మార్చి 31 వరకు అప్లోడ్ చేసిన బిల్లులు అన్నింటికీ చెల్లింపులు జరిగాయన్నారు. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం కారణంగా 13 మండలాల బిల్లులు ఆలస్యంగా అప్లోడ్ చేయడం వల్ల జిల్లాకు కేటాయించిన నిధులు వెనక్కి వెళ్ళాయన్నారు. భవన నిర్మాణాల ప్రగతిలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లతో పాటు ఎంపీడీవోలు, ఉపాధిహామీ ఏపీడీలు పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇటీవల తాను చాగలమర్రి మండలంలో విజిట్ చేసిన ప్రయారిటీ భవనంలో సిమెంట్ వున్నా నిర్మాణ పనులు జరగడం లేదని ఇంజనీరింగ్ అసిస్టెంట్ తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. భూసేకరణలో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత ఆర్డిఓ, జాయింట్ కలెక్టర్ తో సంప్రదించి పరిష్కరించుకోవాలే కానీ రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టడం పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా పనితీరు మెరుగు పరుచుకుని సచివాలయాల వారీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రెటరీల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నందికొట్కూర్, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయని పంచాయతీరాజ్ డీఈలు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 415 గ్రామ సచివాలయాల భవనాలకు గాను 238 భవనాలు, 394 రైతు భరోసా కేంద్రాలకు గాను 105 ఆర్బికేలు, 274 వైయస్సార్ హెల్త్ క్లినిక్లకు గాను 53 భవనాలు పూర్తయ్యాని.. వివిధ నిర్మాణ దశలో ఉన్న భవనాలను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేసేందుకు ప్రాక్టికల్ ప్రణాళికను అమలు పరిచి వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను, ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ఈ రామమోహన్, డిపిఓ శ్రీనివాసులు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ భాస్కర్ నాయుడు, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.