You are currently viewing స్పందన దరఖాస్తుల్లో జాప్యాన్ని నివారించండి

స్పందన దరఖాస్తుల్లో జాప్యాన్ని నివారించండి

  • Post category:Nandyal

సరైన రీతిలో పరిష్కరించకపోవడం వల్లే మళ్లీ రీఓపెన్ అవుతున్న దరఖాస్తులు

స్పందన అర్జీలకు శాశ్వత పరిష్కారం కల్పించండి

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులలో జాప్యాన్ని నివారించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్‌.ఎ.ఆర్.ఎస్‌) వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య తదితర జిల్లాధికారులు నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ గడివేముల, ఆళ్లగడ్డ, వెలుగోడు, డోన్, బనగానపల్లి, అవుకు, కొత్తపల్లి, సంజామల, రుద్రవరం, పాణ్యం మండలాలకు చెందిన పంచాయతీ సెక్రెటరీలు, ఎంపిడిఓలు, రెవిన్యూ సంబంధిత అధికారులు స్పందన దరఖాస్తులకు మొక్కుబడి రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వడం వల్లే మళ్లీ రీ ఓపెన్ అవుతున్నాయని… ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సరైన రీతిలో సమాధానం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన దరఖాస్తుల పరిష్కారంపై ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ ప్రత్యేకంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో అధికారులు అందరూ సీరియస్ గా తీసుకోవాలన్నారు. రీఓపెన్ అవుతున్న దరఖాస్తులపై ఆర్డీఓలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఫిర్యాదుదారుడు సమర్పించిన ప్రతి అర్జీని క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారాన్ని కిందిస్థాయి సిబ్బందికి అప్పగించకుండా అధికారులే పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో స్పందన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు సంబంధిత ఫోటోగ్రాఫ్స్ స్పందన పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులెవరూ చేయడం లేదని ఈ విషయంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఎలోకి వెళ్ళకుండా, రీ ఓపెన్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ జాప్యాన్ని నివారించి వేగంగా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు

వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామ నివాసి పోతం సుధాకర్ రెడ్డి తన సర్వే నంబర్ 390 లో 2.98 సెంట్ల భూమి కలదని… అయితే హౌస్ హోల్డ్ సర్వేలో నా రేషన్ కార్డు వేరే ఫ్యామిలీలో కలపడం వల్ల 10 ఎకరాల భూమి చూపుతున్న కారణంగా గత తొమ్మిది నెలల నుండి రైతు భరోసా లబ్ది, పెన్షన్ కూడా రావడంలేదని దయతో తన సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామ నివాసితుడు దస్తగిరి తనకు సర్వే నంబర్ 416 పైకి 0.58 సెంట్ల భూమిని 2019 లో కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నానని సంబంధిత భూమి ఆన్లైన్లో నమోదు చేయాలని పలుమార్లు అర్జీ పెట్టుకున్నానని దయతో తనకు పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని కలెక్టర్ తో మొరపెట్టుకుంటూ దరఖాస్తు సమర్పించుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణ వాస్తవ్యుడు ఎన్.వెంకటేశ్వర్లు తాను ఎస్టి ఎరుకుల కులమునకు చెంది కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నానని… బిసి వర్గానికి చెందిన మహిళను కులాంతర వివాహం చేసుకున్నానని నా సంతతికి కూడా ఎస్టి ఎరుకుల కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు సమర్పించుకున్నారు. నంద్యాల పట్టణ నివాసి ఫకీర్ సాబ్ తనకు సర్వే నంబర్ 530/2 లో ప్లాట్ ఇచ్చారని అయితే సంబంధిత స్థలం దురాక్రమణకు గురైందని విచారించి తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కు నివేదించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దాదాపు 171 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతి పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.