న్యూఢిల్లీలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నుంచి మొదలైన పదవ ఏషియన్ పారా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఒక కిలో మీటర్ సైక్లింగ్ రేస్ లో నంద్యాల వాసి అర్షద్ రజత పతకం సాధించాడు. బంగ్లా దేశ్ సైక్లింగ్ ఫెడరేషన్ సెక్రెటరీ జనరల్ మహమ్మద్ ధరూరు ఆలం, భారత్ సైక్లింగ్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి భరత్ పటేల్ అర్షద్ కు పతకం, జ్ఞాపిక అందించి అభినందించారు. ఆర్షద్ ఈ పోటీల కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ వెలో డ్రోమ్ లో సాధన చేయడం జరిగింది. ఏషియన్ చాంపియన్ షిప్ పోటీలలో పతకం సాధించిన అర్షద్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ఫోన్ లో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఆర్షద్ ప్రాథమిక పాఠశాల దశలో టైక్వాండో నేర్చుకునే వాడని, ప్రమాదంలో ఒక కాలు కోల్పోవడంతో కృత్రిమ కాలు సహాయంతో వివిధ క్రీడల్లో నిరంతర సాధన చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలోఅనేక విజయాలు సాధించాడని తెలిపారు. విలువిద్య లో నంద్యాలలో కోచ్ ను పిలిపించి శిక్షణ ఇప్పించడం జరిగిందని, తర్వాత విజయవాడ వోల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందాడని, తర్వాత హైదరాబాద్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతారోహణలో శిక్షణ పొంది 80 వేల అడుగుల ఎత్తైన మౌంట్ భాగీరధి పర్వతారోహణ చేయడం జరిగిందని తెలిపారు. ( బి.ఎస్.ఎఫ్ ) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కృత్రిమ కాలు సహాయంతో సైకిల్ యాత్ర పూర్తి చేశారని చెప్పారు. అర్షద్ స్విమ్మింగ్, బాడీ బిల్డింగ్ క్రీడలలో రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించారని గుర్తు చేశారు. డిగ్రీ పూర్తి చేసి, వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చిన పేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడైన అర్షద్ కు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నంద్యాల అర్షద్ కు ఆసియా క్రీడలలో రజత పతకం
- Post published:June 19, 2022
- Post category:Nandyal