You are currently viewing ప్రాధాన్యతా భవనాలు త్వరితగతిన పూర్తి చేయండి

ప్రాధాన్యతా భవనాలు త్వరితగతిన పూర్తి చేయండి

  • Post category:Nandyal

బిలో బేస్మెంట్ స్థాయిలో వున్న భవనాలను వెంటనే ప్రారంభించండి

-స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి

ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోందని ఇంకా ప్రారంభం కాని ప్రాధాన్యత భవనాల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం విజయవాడలోని తన కార్యాలయం నుండి ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు, గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ కోన శశిధర్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో చేపట్టిన ప్రయారిటీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను రూఫ్ స్థాయికి తీసుకరావడంతో పాటు పూర్తయిన భవనాలను సంబంధిత శాఖలకు స్వాధీనం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ బిలో బేస్మెంట్ స్థాయిలో వున్న 28 గ్రామ సచివాలయ భవనాలు, 106 రైతు భరోసా కేంద్రాలు, 78 వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించేందుకు పంచాయతీ రాజ్ డిఈ, ఎఈ లకు లక్ష్యాలు నిర్ధేశించామన్నారు. స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో కోఆర్డినేట్ చేసుకొని సిమెంట్ కొరత లేకుండా ప్రయారిటీ భవన నిర్మాణాలను వేగవంతం చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ వీడియో కాన్ఫెరెన్సులో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, పంచాయతీ రాజ్ ఈఈ రామమోహన్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్, పశుసంవర్ధక జెడి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.