You are currently viewing రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలి

రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలి

  • Post category:Nandyal

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోండి

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

-వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి

ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిందని.. ఇప్పటికే రైతులు సాగు చేసుకుంటున్నారని.. అర్హులైన రైతులందరికీ ఆలస్యం చేయకుండా పంట రుణాలు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్‌.ఎ.ఆర్.ఎస్‌) వైఎస్సార్ సెంటినరీ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మార్క్ ఫెడ్ చైర్పర్సన్ పి.పి. నాగిరెడ్డి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ లో లక్ష్యం మేరకు అర్హులైన రైతులందరికీ వెంటనే పంట రుణ సదుపాయం కల్పించాలని కోరారు. విత్తు నుండి విక్రయం దాకా రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రభుత్వం వ్యవసాయ మండళ్లను ఏర్పాటు చేసిందన్నారు. నెలలో మొదటి శుక్రవారం గ్రామ స్థాయిలో, రెండవ శుక్రవారం మండల స్థాయిల్లో నిర్వహించే వ్యవసాయ సలహా మండలి సమావేశాలు మొక్కుబడి రీతిలో కాకుండా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఉపయోగపడే రీతిలో నిర్వహించేందుకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలపై ప్రతినెల మూడవ శుక్రవారం జిల్లాస్థాయిలు వ్యవసాయ మండలి సమావేశంలో చర్చించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ భూముల కనుగుణంగా ఏ ఏ పంటలు వేసుకోవాలి… సబ్సిడీపై నాణ్యమైన విత్తనాల పంపిణీ పొలాల్లో ఆధునిక యంత్రాల వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ క్రాఫ్ బుకింగ్ ఈకేవై చేయని కారణంగా భీమా ప్రీమియం అందలేదని ఈ క్రాఫ్ బుకింగ్ చేసిన రైతులందరికీ బీమా పరిహారం అందేలా చూడాలని వ్యవసాయ అధికారులను సూచించారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ముమ్మర ఆకస్మిక దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయ దుకాణాల లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లు గ్రూపులుగా కాకుండా వ్యక్తిగత రైతులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా రైతులకు అవసరమయ్యే విత్తనాలను సరఫరా చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు సబ్సిడీపై పౌల్ట్రీ మరియు గొర్రెలు పంపిణీ చేయాలన్నారు. పశువులకు వ్యాక్సినేషన్ ఇవ్వడంతోపాటు ఎద్దులు చనిపోతే ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పశుసంవర్ధక శాఖ జెడి రమణయ్యను ఆదేశించారు. సాగునీటి కాలువల్లో పూడికతీత, ముళ్లపొదల తొలగింపు, లైనింగ్ పనులు చేపట్టి చివరి ఆయకట్టు భూములకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు. ఈ ఖరీఫ్ లో అదనంగా వంద ఎకరాల్లో పట్టు ఉత్పత్తి సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ మండల స్థాయి వ్యవసాయ మండలి సమావేశాలలో చర్చించిన అంశాలను రైతు భరోసా కేంద్రాల వారీగా తీసుకొని జిల్లా స్థాయి సమావేశ దృష్టికి తీసుకురావాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు ను ఆదేశించారు. ప్రతిరోజు వార్తాపత్రికల్లో క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం అందలేదని వార్తలు వస్తున్నాయని… వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ జరిపించి సంబంధిత నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కల్తీ లేని రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతులకు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులకు నీరు చేరిన వెంటనే సాగునీటి కాలువల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.ఈ ఖరీఫ్ లో 2679 కోట్ల రూపాయల పంట రుణాలకు గాను ఇప్పటివరకు 623 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని మిగిలిన పంట రుణాలను త్వరితగతిన మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ ను ఆదేశించారు. మార్క్ ఫెడ్ చైర్పర్సన్ పి.పి. నాగిరెడ్డి మాట్లాడుతూ గోస్పాడు మండలంలో ఈ క్రాఫ్ బుకింగ్ చేసిన రైతులకు భీమా ప్రీమియం అందలేదని ఈ క్రాఫ్ బుకింగ్ చేయని రైతులకు బీమా ప్రీమియం జమ అయిందని ఈ విషయంపై సీరియస్ గా విచారించి తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ అధికారి రమణ, మార్కెటింగ్, సెరికల్చర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.