స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించండి

  • Post category:Nandyal

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ప్రజల అవసరాలకు తగ్గ ఏర్పాట్లు, పేదరిక నిర్మూలన, ఆర్ధిక అసమానతలు, సాంకేతిక పరిమితులు, ప్రస్తుత, భవిష్యత్ తరాల మధ్య స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కొన్ని సూచికలు జారీ చేసిందని ఈ మేరకు నిర్ధేశించిన లక్ష్యాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ జిల్లాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్సు హాలులో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య, సిపిఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రాధాన్యత అంశాలపై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల ఆధారంగానే దేశ, రాష్ట్ర ర్యాంకింగ్ నిర్ధేశిస్తారని ఈ మేరకు కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గోల్ కు కొన్ని ఇండికేటర్స్ వున్నాయని జిల్లాస్థాయిలో 61, గ్రామస్థాయిలో 47 ఇండికేటర్స్ వున్నాయని వీటిని సచివాలయ సిబ్బందితో సాధించేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అగ్రికల్చర్ 4, డీఈఓ 7, సివిల్ సప్లైస్ 3 , ఫారెస్ట్ 3, గ్రౌండ్ వాటర్ 2, మున్సిపల్ 2, ఐసిడిఎస్ 2, మెడికల్ అండ్ హెల్త్ 11, పంచాయతీరాజ్ 2, ఆర్డబ్ల్యూఎస్ 2, మిగిలిన శాఖల్లో ఒక్కొక్కటి చొప్పున ఇండికేటర్స్ ఉన్నాయని వీటిలో ఏ మేరకు అమలు చేస్తున్నారని కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు, పర్యవేక్షణకు ప్రతి శాఖలో నోడల్ అధికారిని నియమించాలన్నారు. ప్రతి నెల 30 వ తేదీలోగా నిర్ధేశించిన ఫార్మాట్ లో డేటా ఎంట్రీ చేసి జిల్లా ప్రణాళికాధికారి కార్యాలయానికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. సూచించిన ఇండికేటర్స్ నవరత్నాల కార్యక్రమంలో మిళితమై వున్నాయని పకడ్బందీగా అమలు చేస్తే అన్నింటిలో సుస్థిరమయిన అభివృద్ధి సాధించవచ్చన్నారు. ఇండికేటర్స్ పక్కాగా అమలు చేస్తే ఎక్కడ అభివృద్ధి చెందింది, ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందలేదో విశ్లేషించుకోవచ్చన్నారు.