- స్పందన అర్జీలకు శాశ్వత పరిష్కారం కల్పించండి
- బియాండ్ ఎస్ఎల్ఎలో దరఖాస్తులు ఉండకూడదు
- -జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేల కార్యక్రమాల్లో సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్.ఎ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య తదితర జిల్లాధికారులు నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సచివాలయ పరిధిలోని వీధుల్లో పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సేవా సంబంధిత సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు మండల స్థాయి అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రహదారులు, డ్రైనేజీలు, స్ట్రక్చర్ ల నిర్మాణాలకు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులకు చేరవేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలకు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే మన దృష్టికి వచ్చిన నంద్యాల – మూలసాగరం రహదారి మరమ్మతు పనులు, డోన్, నందికొట్కూర్ మండలాల్లోని కామగానిగుంట్ల, బిజినవేముల గ్రామాలలో నీటి సమస్య, జూపాడుబంగ్లా, రుద్రవరం మండలాల్లోని డ్రైనేజీ సమస్య తదితర పనులు చేపట్టామన్నారు. సచివాలయాల పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల ఫోటోగ్రాఫ్స్ ను సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఎంపీడీవో లను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు వేగంగా, శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబందిత జిల్లా అధికారులను ఆదేశించారు. స్పందనలో వచ్చే సమస్యలు పరిష్కరిస్తే బియాండ్ ఎస్ఎల్ఎలోకి దరఖాస్తులు ఎందుకు పెండింగ్లో వున్నాయని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. స్పందన కార్యక్రమానికి ఆయా మండలాల్లో గైర్హాజరైన జూపాడుబంగ్లా, మహానంది, పాణ్యం, వెలుగోడు మండలాల ఎంపిడిఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. స్పందన అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత కాలపరిమితిలోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు
గడివేముల మండలం గని గ్రామ నివాసితురాలు కె.కలిమున్ తాను కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని… తనకు సర్వే నంబర్ 677/1లో 4.66 సెంట్ల భూమి కలదని సంబంధిత భూమి సోలార్ ప్రాజెక్టుకు తీసుకున్నారని సదరు భూమి విలువ రు. 19,57,200/- లు గా నిర్ణయించి ఇందులో రూ. 9,78,600/-లు చెక్కు ఇచ్చారని మిగిలిన మొత్తం 10 రోజుల్లో ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని దయతో తనకు సంబంధిత మొత్తం ఇప్పించవలసిందిగా కలెక్టర్ ను కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. బనగానపల్లి మండలం యనకండ్ల గ్రామ నివాసితురాలు నడిపెక్క తనకు సర్వే నంబర్ 388/2లో 5 ఎకరాల భూమి వున్నదని తన పాసుబుక్ తనఖాగా వుంచుకొని తన కుమార్తె వివాహానికి రుణం మంజూరు చేయించాల్సినదిగా కోరుతూ దరఖాస్తు సమర్పించుకున్నారు. శిరువెళ్ల మండల నివాసితురాలు అత్తార్ సబనా సర్వే నంబర్ 1018/ఎ1లో 3.05 ఎకరాల డి.పట్టా వుందని సంబంధిత పట్టాదారు పాసు పుస్తకం పోయిందని మరొక పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించ వలసిందిగా కోరుతూ అర్జీ కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 198 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతి పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఉదృత అతిసార నియంత్రణ ప్లెక్సీ బ్యానర్ ను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, డిఎంహెచ్ఓ తదితరులు ఆవిష్కరించారు.