ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల యూరాలజీ వైద్యుల సంఘం పర్యవేక్షణలో,నంద్యాల, కర్నూల్ జిల్లాల యూరాలజీ వైద్యుల సంఘం నిర్వహణలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నంద్యాలలో డాక్టర్ రంగనాథ రావు స్మారక రెండు తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్యుల వైజ్ఞానిక సదస్సు స్థానిక సూరజ్ గ్రాండ్ హోటల్ లో జరిగింది. ఈ సదస్సులోరెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి యూరాలజీ వైద్య నిపుణులు, యూరాలజీ పీజీ వైద్య విద్యార్థులు 200 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, ఐ ఎం ఎ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ అతిథులుగా పాల్గొని జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. డాక్టర్ రంగనాథ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా మాజీ రాష్ట్ర ఐఎమ్ఏ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ ప్యాట్రన్, కర్నూలు వైద్య కళాశాలలో యూరాలజీ విభాగం వ్యవస్థాపకులు డాక్టర్ విక్రమ సింహ రెడ్డి మాట్లాడుతూ యూరాలజీ వైద్యరంగంలో వచ్చిన ఆధునిక మార్పులు తెలుసుకోవడానికి తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత ఇంత పెద్ద స్థాయి వైద్య సదస్సు నంద్యాలలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సాంకేతికంగా వైద్యరంగం అభివృద్ధి చెందుతున్నదని, అదే సమయంలో వైద్య విద్య లోపాలు సరిదిద్దుకుని మెరుగు పరచవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ ఆరోగ్య శ్రీ పరిధిలో అనేక యూరాలజీ చికిత్సలను చేర్చి ప్రజలకు యూరాలజీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ యురాలజి విభాగంలోని మూత్ర పిండాలు, మూత్రాశయం, మూత్ర నాళ సమస్యలకు గతంలో పెద్ద నగరాలకు వెళ్ళవలసి వచ్చేదని ఇప్పుడు యూరాలజీ వైద్యనిపుణులు అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి రావడంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం ఎక్కువ మందికి అందుతున్నదని అన్నారు. నిర్వాహక కార్యదర్శి డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, మాట్లాడుతూ నంద్యాలలో ఈ సదస్సు ఏర్పాటు చేయడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.నంద్యాలలో యూరాలజీ విభాగంలో అన్ని రకాల ఆధునిక వసతులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ గోవిందరెడ్డి, అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ సహదేవుడు నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ జయ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఇరవై నాలుగు అంశాలపై వివిధ నగరాల నుంచి వచ్చిన యూరాలజీ వైద్య నిపుణులు ఈ విభాగంలో వచ్చిన ఆధునిక మార్పులు చికిత్స అందించడంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
