- 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ లక్ష్యం రూ.9084.59 కోట్లు
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వ్యవసాయ, ఎస్ హెచ్జి బ్యాంక్ లింకేజ్, హౌసింగ్ తదితర రంగాలకు లక్ష్యం మేరకు రుణాలందించి జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ బ్యాంకర్లు, జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్.ఎ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో బ్యాంకర్లతో ప్రత్యేక డిసిసి (జిల్లా సమన్వయ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటనారాయణ, నాబార్డ్ డిడిఎమ్ పార్థువా, కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ ఈశ్వరయ్య, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్, బ్యాంకర్లు, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో రూ .9084.59 కోట్ల రుణాలు ఇవ్వాలని అధికారులు, బ్యాంకర్ల లక్ష్యంగా నిర్దేశించారు. రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహరుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక, తదితర రంగాలకు రూ 9084.59 కోట్లు కేటాయింపు జరిగిందన్నారు. జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని… తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్ తదితర సాగునీటి కాలువల కింద రైతులు పంటలు సాగు చేసుకుంటున్న నేపథ్యంలో సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు విరివిగా రుణాలు అందించి సహకరించాలని బ్యాంకర్లను కలెక్టర్ సూచించారు. బ్యాంకుల వారీగా జాయింట్ లయబిలిటీ గ్రూపుల జాబితాను తయారుచేసి సంబంధిత డేటాను బ్యాంకర్లకు అందజేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను కల్పించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట ఉత్పత్తి నిర్వహణ, మార్కెటింగ్ కోసం ఖరీఫ్ లో 2679.86 కోట్లు, రబీలో 1148.51 కోట్ల పంట రుణాలు రైతులకు ఇవ్వాలన్నారు. అలాగే వ్యవసాయానికి టెర్మ్ లోన్ల కింద రైతులకు రూ 1106.45 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాలకు సంబంధించి రూ 227.33 కోట్లు ఇవ్వాలని ప్రణాళికలో పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి ఎంటర్ప్రైజెస్ కు రూ 1212.18 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. విద్యా రుణాలకు రూ 43.55 కోట్లు, గృహరుణాలకు రూ 261.14 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కోసం రూ 10.99 కోట్లు, పునరుత్పాదక శక్తి కింద రూ 12.92 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి రూ 168.71 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. రుణ ప్రణాళికలో నిర్ధేశించిన మేరకు ఆయా రంగాలకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని ఇందుకు సంబంధించి అన్ని రకాల బ్యాంకు శాఖలు అర్హత పొందిన లబ్ధిదారులకు వెంటనే రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. యువ పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అర్హత మేరకు రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పనకు తోడ్పాటును అందించాలన్నారు. స్వయం సహాయక బృందాల మహిళలకు, జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించుకునే లబ్ది దారులకు, టిడ్కో గృహ లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. 2023-24 సంవత్సరానికి నాబార్డ్ పిఎల్ పి క్రెడిట్ ప్లాన్ తయారు చేసేందుకు అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళిక నివేదికలను నాబార్డ్ డిడిఎమ్ కు అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్దేశించిన అన్నిరకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటనారాయణ జిల్లా కలెక్టర్ కు నివేదించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ, మెప్మా అధికారులు, వ్యవసాయశాఖ అధికారి మోహన్ రావు, ఉద్యాన శాఖ అధికారి రమణ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.