You are currently viewing హైరిస్క్ గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

హైరిస్క్ గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

  • Post category:Nandyal

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ప్రసవం ముందు ప్రసవం తర్వాత మాతృ మరణాల రేటును గణనీయంగా తగ్గించేందుకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్సలు అందించేందుకు నిరంతర కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. మంగళవారం వైఎస్ఆర్ సెంటినరీ హాలులో హై రిస్క్ గర్భిణీ స్త్రీ, మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రభావతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారుల పరస్పర సమాచార సమన్వయలోపం, నిర్లక్ష్యం కారణంగానే హైరిస్క్ గర్భిణీ స్త్రీలు, బాలింతల మరణాలు సంభవిస్తున్నాయని ఇలాగే కొనసాగితే సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తమ పరిధిలోని హైరిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించి రక్తహీనత, డయాబెటిస్, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి క్రమం తప్పకుండా మందులు ఇవ్వడంతోపాటు యాంటీనేటల్ చెకప్ చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలో అయితే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆయా ప్రాంతాల్లోని ఆశావర్కర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. స్థానికేతర ఆసుపత్రులకు రెఫర్ చేయవలసి వస్తే సంబందిత మెడికల్ ఆఫీసర్లు, ఆశావర్కర్లు ఆయా ఆసుపత్రుల వైద్య సిబ్బందికి అప్పగించేంతవరకు బాధ్యతలు తీసుకోవాలన్నారు. గత రెండు నెలల వ్యవధిలో మరణించిన 7 మంది గర్భిణీ స్త్రీలు, బాలింతల వివరాలపై కలెక్టర్ ఆరా తీస్తూ సూక్ష్మస్థాయిలో మెడికల్ అధికారులను, ఆశా వర్కర్లు, సంబంధిత కుటుంబ సభ్యుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రసవం అయిన తర్వాత 7 సార్లు బాలింతల ఇళ్లకు వెళ్లి పోస్ట్ నేటల్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా చేయాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రతినెల 9వ తేదీ పి.సి.పి.ఎన్.డి.టి స్కానింగ్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రక్తహీనత, ఇతర శారీరక లోపం ఉన్న గర్భిణీ స్త్రీలకు పోషకాహార పదార్థాలు ఇవ్వాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారుల మధ్య ఉన్న గ్యాప్ ను భర్తీ చేసుకుంటూ క్రమం తప్పకుండా నిర్దేశించిన రొటీన్ విధులను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.