You are currently viewing మనబడి నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయండి

మనబడి నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయండి

  • Post category:Nandyal

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

నంద్యాల: మనబడి నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదులు, చిన్న చిన్న మరమ్మతు పనులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. బుధవారం మునిసిపల్ టౌన్ హాలులో మన బడి నాడు- నేడు రెండవ దశ పనుల పురోగతిపై విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష, మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖలకు చెందిన ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్షించారు. సమగ్ర శిక్ష అదనపు కో – ఆర్డినేటర్ డా.కె వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ మనబడి నాడు నేడు పథకం కింద చేపట్టిన అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, త్రాగునీరు, ఎలాక్ట్రీషియన్, కిచెన్ షేడ్స్, కంపౌండ్ వాల్, ఫర్నిచర్ తదితర 10 కంపోనెంట్ పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు.పనుల్లో నాణ్యత లోపించినా, నాసిరకం వస్తువులు వినియోగించినా సంబంధిత ఇంజినీర్లు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేస్తామన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రారంభ దశలో ఉత్సహంగా చేస్తే ఆటోమేటిక్ గా మంచి ప్రగతి వస్తుందని ఈ మేరకు అధికారులు, ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించి పనులు బాధ్యతతో చేపట్టాలన్నారు. మొదటి దశలో చేపట్టిన ఆర్ఓ ప్లాంట్లు, ఫర్నిచర్, ఇతర మౌళిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలని కలెక్టర్ ఆదేశించారు. నాడు-నేడు కింద 437 పాఠశాలల్లో 517 పనులకు గాను 488 పనులకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని ఇందులో రివాల్వింగ్ ఫండ్ కింద 4.67 కోట్ల రూపాయలు పేరెంట్స్ కమిటీల బ్యాంకు ఖాతాల్లో జమ అయిందన్నారు. అలాగే వివిధ పనులకు సంబంధించి 1.1 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ బుక్ చేశారన్నారు. నిర్మాణ పనులు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసు కోవాలని ఇంజినీర్లను ఆదేశించారు. పనుల నాణ్యతపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలన్నారు. నిర్మా ణానికి అవసరమైన సిమెంట్, స్టీల్ తెప్పించడంలో జాప్యం చేయకూడదని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని నాణ్యతపై సమీక్షించాలని డీఈఓను సూచించారు.