You are currently viewing ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన సేవలు అందించండి

ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన సేవలు అందించండి

  • Post category:Nandyal

లక్ష్యసాధనలో పురోగతి కనిపించాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్

నంద్యాల: ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు ప్రసవాలు జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్.ఏ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో మెడికల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ జఫ్రల్లా, అడిషనల్ డిఎంహెచ్ఓ పి.లలిత, అన్ని ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, 24/7 వైద్యాలయాలు, సబ్ సెంటర్లకు కేటాయించిన నెలవారి లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. లక్ష్యాల ప్రగతిని సమీక్షిస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేస్తూ సమయ పాలన పాటించాలన్నారు. తాను చేసిన తనిఖీల్లో డాక్టర్లు హాస్పిటల్ కు రావడం లేదని, సరిగా చికిత్స చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారన్నారని పనితీరు మెరుగుపరుచుకుని రోగులకు వైద్యసేవలు అందించాలన్నారు. నెట్ వర్క్ పనిచేయడం లేదని, సదుపాయాలు లేవని కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉందని ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలను మోటివేట్ చేసి ప్రసవాలలతోపాటు ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్, చంటి పిల్లలకు ఇమ్యునైజేషన్, మదర్ అండ్ చైల్డ్ రిజిస్ట్రేషన్ తదితర అంశాల్లో చురుకుగా ఉండి ఫాలప్ వేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 అర్బన్ హెల్త్ సెంటర్లు, 31 ఇరవై నాలుగు గంటల ఆసుపత్రులు, 491 సబ్ సెంటర్లు లలో ఉన్న వైద్య సిబ్బంది కొరత, ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలపై పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని కలెక్టర్ డిఎంహెచ్ఓను ఆదేశించారు. నాడు నేడు కింద చేపట్టిన ఆసుపత్రి భవనాల నిర్మాణాలు, ఆసుపత్రులలో పెండింగ్లో ఉన్న మరమ్మతులలో తీవ్ర జాప్యం జరుగుతుందని సంబంధిత డీఈ, ఎఈ లతో సమావేశాలు నిర్వహించాలని ఈఈని కలెక్టర్ ఆదేశించారు. చాలాచోట్ల మరమ్మతు పనులు, ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులు జరగడం లేదని సంబంధిత మెడికల్ ఆఫీసర్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరమ్మత్తు పనులు చేయడంలో అశ్రద్ధ వహిస్తున్న ఆర్ ఆర్ బి అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్వరితగతిన పూర్తి చేసి మెడికల్ ఆఫీసర్లకు స్వాధీనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.