You are currently viewing సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో రాయలసీమ ఆయకట్టుకు సకాలంలో నీరు

సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో రాయలసీమ ఆయకట్టుకు సకాలంలో నీరు

  • Post category:Nandyal

సిద్దేశ్వరం అలుగు నిర్మించుకుంటే రాయలసీమ ప్రాంత ఆయకట్టుకు సకాలంలో నీరు అందడం వలన పంట దిగుబడి పెరగడమే గాక చీడపురుగుల బెడద నుండి పంటలను కాపాడుకోవచ్చని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. మే 31 న జరుగనున్న సిద్దేశ్వర జలదీక్ష సందర్భంగా నంద్యాల మండలం కానాల గ్రామంలో జలదీక్ష సన్నాహక సభ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులకు నీరు చేరితే కాలువలకు నీరు విడుస్తామన్న ప్రభుత్వం ముందుగా రాయలసీమకు ఉరితాడైన జీ.వో.నెం. 69 ను రద్దు చేయాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలోని ఆయకట్టుకు నీరు అందాలన్నా, త్రాగడానికి నీరు వుండాలన్నా శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు వుంటేనే నీరు లభ్యమవుతుందని అయితే పాలకులు కృష్ణా డెల్టా రైతాంగం కోసం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 790 అడుగుల వరకు నీరు తోడేసి రాయలసీమ ప్రాంతాన్ని ఎండగడుతున్నారని ఆయన విమర్శించారు. ఖరీఫ్ సీజన్ మొదలవుతుంటే రాష్ట్రంలోని అన్ని ఆయకట్టు ప్రాంతాలకు ఏ రోజున నీటిని విడుదల చేస్తామని ప్రకటిస్తున్న పాలకులు రాయలసీమ ప్రాంతానికి మాత్రం శ్రీశైలంలో 854 అడుగులకి చేరినప్పుడే నీరు విడుదల చేస్తామనడం మన రాయలసీమ దుస్థితికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాయలసీమ సమగ్రాభివృద్దికి , త్రాగు, సాగునీటి పరిష్కారానికి సిద్దేశ్వరం అలుగే పరిష్కారమన్నారు. రాజకీయ పార్టీలు కేవలం మాటలతో, వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపరచకుండా వేలాదిమంది ప్రజల ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన చారిత్రాత్మిమైన సిద్దశ్వరం అలుగు నిర్మాణాన్ని తక్షణమే చేపట్టి రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. నంద్యాల-కల్వకుర్తి జాతీయ రహదారిలో భాగంగా సిద్దేశ్వరం దగ్గర నిర్మించనున్న వంతెనతో పాటు అలుగును కూడా నిర్మించాలని కోరారు. ఇండియన్ ఇరిగేషన్ కమీషన్ మరియు బచావత్ ట్రిబ్యునల్ సూచనల మేరకు రాయలసీమ ప్రాజెక్టులకు చట్డబద్ద నీటిని వినియోగించుకోవడానికి క్యారీ ఓవర్ రిజర్వాయర్ల నిర్మాణం తక్షణమే చేపట్టాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేసారు. రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువులు, కుంటల నిర్మాణం/ పునరుద్దరణ తో పాటు వాగులు , వంకలు, నదులు, కాలువలతో అనుసంధానం, సామాజిక అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో రాయలసీమ పర్యావరణ పరిరక్షణ కమీషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సముద్రం పాలవుతున్న కృష్ణా జలాలను నిలువరించి రాయలసీమకు త్రాగు, సాగునీరు అందించడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఆయన అన్నారు. సిద్దేశ్వరం దగ్గర మే 31 న జరిగే జలదీక్ష కార్యక్రమానికి కానాల గ్రామం నుండి స్వచ్చందంగా తరలి రావాలని దశరథరామిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశానికి వచ్చిన రైతులు సిద్దేశ్వర జలదీక్ష గోడపత్రికలను ఆవిష్కరిస్తూ తమ గ్రామం నుండి జలదీక్షకు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేస్తామని ప్రకటించారు.