You are currently viewing ఇళ్ల నిర్మాణాలు ముమ్మరం చేయండి

ఇళ్ల నిర్మాణాలు ముమ్మరం చేయండి

  • Post category:Nandyal

లేబర్ రిపోర్టింగ్ ను గణనీయంగా పెంచండి

ఆర్బికేల ద్వారా విత్తనాలు, ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకోండి

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

డోన్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నిరుపేదలందరికి ఇళ్ళు పథకం కింద జగనన్న లేఔట్ లలో ఇళ్ల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలనిజిల్లా కలెక్టర్ డా. మనజీర్జిలాని సామూన్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం డోన్ ఆర్డీఓ కార్యాలయంలో హౌసింగ్, ఉపాధిహామీ పనులు, ప్రయారిటీ బిల్డింగ్స్, గ్రామీణ నీటిసరఫరా, వైద్యశాఖ, వ్యవసాయం, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖల ప్రగతిపై సమీక్షించారు. ఆర్డీఓ కె.వెంకరెడ్డి, సంబంధిత శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ డోన్ అర్బన్, రూరల్ కలిపి 3859, బేతెంచెర్లలో 3323, ప్యాపిలిలో 1519 గృహాలు మంజూరు కాగా నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని… డిఈ, ఎఈలకు నిర్ధేశించిన రోజువారీ లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. ఇంకా ప్రారంభం కాని 864 ఇళ్లను వెంటనే మొదలు పెట్టించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సొంత స్థలాలు కలిగిన లబ్దిదారులు, నీటి సమస్య లేని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో ఎందుకు అలసత్వం చూపుతున్నారని కలెక్టర్ హౌసింగ్ అధికారులను ప్రశ్నించారు. ఓటిఎస్ కింద పెండింగులో ఉన్న డిజిటల్,రిజిస్ట్రేషన్, స్కానింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు సమన్వయంతో పని చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం కింద రోజురోజుకు లేబర్ రిపోర్టింగ్ ను గణనీయంగా పెంచాలని డ్వామా ఎపిడిని ఆదేశించారు. పనులు కావాలని అడిగిన వారందరికీ పనులు కల్పించాల్సిన బాధ్యత ఎన్ఆర్ఈజిఎస్ సిబ్బందిపై ఉందన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిధులకు కొరత లేదని పూర్తయిన వాటికి ఎక్స్పెండిచర్ బుక్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలు మొదలయ్యాయని రైతులు భూములు దున్నుకుంటున్నారని డోన్ డివిజన్లో 65 వేల హెక్టార్లలో సాగు చేసుకుంటున్న రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ముందుగానే అందచేయాలని వ్యవసాయక శాఖ ఎడిని కలెక్టర్ ఆదేశించారు. నకిలీ విత్తన విక్రయ కేంద్రాలు, ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు ముమ్మరం చేసి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాధమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు రోగులకు మెరుగైన సేవలు అందించాలని డిఎంహెచ్ఓ ను ఆదేశించారు. పెండింగులో వున్న 48 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎక్కడా త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆర్ డబ్ల్యుఎస్ అధికారులను సూచించారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, నాడు నేడు కింద చేపట్టిన పురోగతి పనులు వేగవంతం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణి స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం మెనూ ప్రకారం అందచేయాలని కలెక్టర్ సీడీపీఓను ఆదేశించారు.