You are currently viewing రాయలసీమ సాగు, తాగు నీటికి ఐక్యంగా ఉద్యమిద్దాం

రాయలసీమ సాగు, తాగు నీటికి ఐక్యంగా ఉద్యమిద్దాం

  • Post category:Nandyal

రాయలసీమకు సాగు,త్రాగునీటి విషయంలో దశాబ్దాలుగా వివక్షకు గురవతున్నామని, రాయలసీమ ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపు నిచ్చారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామం లో సిద్దేశ్వర జలదీక్ష సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు డ్యాంలో పూడిక ఎక్కువగా చేరడంవలన పూర్తి స్థాయి నీటి కంటే తక్కువగా నీటి లభ్యత వుంటోందని, ఇలాగే డ్యాంలో పూడిక చేరితే శ్రీశైలం డ్యాం భద్రత ప్రమాదంలో వుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యాం జీవితకాలం పెరగడానికి, డ్యాం లో పూడిక నివారణకు , డ్యాం రక్షణకు తక్షణమే సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని దీని వలన రాయలసీమ ప్రజానీకానికి త్రాగు, సాగు నీరు అందించి రాయలసీమ కరువును శాశ్వతంగా పారదోలవచ్చని పేర్కొన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని కోరుతూ 2016 మే 31 న వేలాదిమంది ప్రజలు కలిసిరాగా సిద్దేశ్వరం దగ్గర ప్రజా శంఖుస్థాపన చేసామని ఆయన గుర్తు చేస్తూ ఎక్కడైతే మనము అలుగు కోసం శంఖుస్థాపన చేసామో ఇప్పడు అక్కడ కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వంతెనను నిర్మిస్తోందని వంతెనతోపాటు అలుగు కూడా నిర్మించాలని కోరుతూ మనము సిద్దేశ్వరం దగ్గర జలదీక్ష చేపడుతున్నామని ఆయన తెలిపారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి ఎలాంటి భూసేకరణ అవసరం లేదని అంతేకాక ఏ ప్రాంతం కూడా ముంపుకు గురవదని,అతి తక్కువ ఖర్చుతో అలుగు నిర్మాణం చేపట్టవచ్చని, దీని వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా రాయలసీమ నీరు వినియోగించుకోవచ్చని ఐదు మంది కమిటీగా వున్న ఇంజనీర్స్ ఇన్ చీఫ్స్ కమిటీ సిఫారసు చేసిందన్న విషయం ప్రభుత్వానికి దశరథరామిరెడ్డి గుర్తు చేసారు. రాయలసీమ ప్రజానీకానికి ఇదొక సువర్ణాకాశమని సిద్దేశ్వర అలుగు నిర్మాణం కొరకు, రాయలసీమ ప్రాంత సాగు,త్రాగునీటి కొరకు అధికార, ప్రతిపక్ష పార్డీలు సిద్దేశ్వర అలుగు నిర్మాణం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాయలసీమ పై వివక్ష చూపుతున్నారని, ఇలాగే కొనసాగితే రాయలసీమ ప్రాంతం భవిష్యత్తులో ఎడారి కానుందని ఆయన హెచ్చరించారు. రాయలసీమ లోని రాజకీయ నాయకులు ఈ విషయం పై మౌనం వీడి రాయలసీమ చట్టబద్ద నీటిహక్కులకై, సిద్దేశ్వర అలుగుకై ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని కోరుతూ మే 31 న సిద్దేశ్వర జలదీక్ష ను నిర్వహిస్తున్నామని ఈ జలదీక్షకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి జలదీక్షను విజయవంతం చేయాలని దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు కోటకొండ నిర్మలమ్మ, బాలిరెడ్డి, గుండంపాడు మాజీ సర్పంచ్ రాంనారాయణరెడ్డి, రమణారెడ్డి,ఏసన్న, దేవరాజ్, భోయ వెంకటేశ్వర్లు, జమాల్, పి. అశోక్ భాస్కర్ రెడ్డి, మాధవ రెడ్డి, ప్రతాపరెడ్డి, నందిపల్లె సాగేశ్వరరెడ్డి, భోయ మహానంది, జానకిరాముడు, నాగేశ్వరరావు, డి కొట్టాల సర్పంచ్ నరసింహ రెడ్డి, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.