You are currently viewing నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్తీషియా వైద్య వైజ్ఞానిక సదస్సు

నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్తీషియా వైద్య వైజ్ఞానిక సదస్సు

  • Post category:Nandyal

భారత జాతీయ అనస్తీషియా వైద్యుల సంస్థ ఆధ్వర్యంలో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనస్థీషియా వైద్యుల సంఘం పర్యవేక్షణలో,నంద్యాల అనస్థీషియా వైద్యుల సంఘం నిర్వహణలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్తీషియా వైద్యుల వైజ్ఞానిక సదస్సు రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అనస్తీసియా వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రెడ్డి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో, జాతీయ అనస్తీసియా వైద్యుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన భీమేశ్వర్, ఐ ఆర్ సి జాతీయ చైర్మన్ డాక్టర్ చక్ర రావు, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. జాతీయ అనస్థీషియా వైద్యుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన భీమేశ్వర్ మాట్లాడుతూ శస్త్రచికిత్సల వైద్యంలో అనస్థీషియా వైద్యుల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, అనస్తీషియా వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లనే అత్యంత ఆధునిక గుండె ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్లు, అవయవాల మార్పిడి ఆపరేషన్ లు నిర్వహించే అవకాశం ఏర్పడిందన్నారు. మత్తుమందు వైద్యులు కేవలం ఆపరేషన్లకు మత్తుమందు ఇవ్వడమే కాకుండా అత్యవసర చికిత్సా విభాగం లో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారని,ముఖ్యంగా గత రెండు సంవత్సరాల కరోనా సమయంలో అత్యవసర చికిత్సా విభాగం లో దేశవ్యాప్తంగా అనస్తీసియా వైద్యులు విశేషంగా కృషి చేసి వేలాది ప్రాణాలు కాపాడారని తెలిపారు. రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనస్తీషియా వైద్యరంగంలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు మత్తుమందు వైద్యులు తెలుసుకోవడం ద్వారా సురక్షితంగా శస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. అందుకు ఈ వైద్య విజ్ఞాన సదస్సులు ఎంతో ఉపయోగకరం అన్నారు. సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్తీషియా వైద్యుల వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. సదస్సులో అనస్తీషియా వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, వాటిని వినియోగించే విధానం, పర్యవసానాల గురించి 10 అంశాలపై చెన్నై,బెంగళూరు,హైదరాబాద్, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, తదితర ప్రాంతాలకు చెందిన అనస్తీషియా వైద్య రంగ ప్రముఖులు డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ లోకనాథ్, డాక్టర్ రాజేష్, డాక్టర్ శేషఫణి, డాక్టర్ సుబ్రహ్మణ్యం,డాక్టర్ సంపత్,డాక్టర్ శ్రీధర్, మల్టీ మీడియా సహకారంతో ప్రసంగించారు. ఈ సదస్సులో రాష్ట్ర నలుమూలల నుండి అనస్తీషియా వైద్య నిపుణులు, అనస్తీషియా పీజీ వైద్య విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు. సదస్సులో జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల కిషన్, రాష్ట్ర సంఘం కార్యదర్శి డాక్టర్ అచ్యుతరామయ్య, కోశాధికారి డాక్టర్ శ్రీనివాసరావు,మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ కిరణ్ జేరా, రాష్ట్ర మాజీ అధ్యక్షులు వేణుగోపాలరావు, నంద్యాల నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ నాగరాజ రెడ్డి, రామక్రిష్ణ పిజి కాలేజ్ డైరెక్టర్ హేమంత్ రెడ్డి, సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల అనస్తీషియా వైద్యుల సంఘం తరఫున అతిథులను వక్తలను ఘనంగా సత్కరించారు.