ప్రతి చెరువులో 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు చర్యలు చేపట్టండి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్
భవిష్యత్తులో త్రాగునీటి సమస్య తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం మిషన్ అమృత్ సరోవర్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ మేరకు జిల్లాలోని గుర్తించిన చెరువులను శుభ్రం చేయడంతో పాటు పూడిక మట్టి తొలగింపుకు చర్యలు గైకొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ నీటి సంరక్షణ అధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్.ఏ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో మిషన్ అమృత్ సరోవర్ పథక అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ మిషన్ అమృత్ సరోవర్ పథకం కింద గుర్తించిన చెరువులను అమృత్ సరోవర్ లుగా మార్చేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి సంరక్షణ అధికారులతో పాటు భూగర్భ జల శాఖ, డిఆర్డిఎ, జలవనరుల శాఖ, వ్యవసాయ.. వ్యవసాయ అనుబంధ సంస్థల సమన్వయంతో చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి చెరువులో 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి రైతుల పొలాలకు వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే చెరువు గట్ల పటిష్టతకు మట్టిని వినియోగించుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో పాటు సామాన్య ప్రజలు, గ్రామస్తులు, రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ సూచించారు. నంద్యాల జిల్లాలో అధికంగా నీటి వనరులు నిల్వ ఉండే ప్రదేశాలున్నాయని…ఒక ఎకరా నీటి నిలువ ఉండే ప్రాంతాలను కూడా గుర్తించి అమృత్ సరోవర్ లుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, ఫారం పాండ్స్ తదితర ఏ ఏ ప్రదేశాల్లో ఫీజుబిలిటి ఉందో గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న 327 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులలో డిపేనింగ్, బండ్ స్త్రెంత్, ఫీడర్ ఛానెల్, సప్లై ఛానల్, ప్లాంటేషన్ తదితర పనులను అభివృద్ధి చేసేందుకు మండల, గ్రామ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించుకొని ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ అమృత్ సరోవర్ లు భూగర్భ జలాలను సంరక్షించడమే గాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, డిఆర్డీఏ పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణ, భూగర్భజల, మైనర్ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.