రహదారి ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోండి

  • Post category:Nandyal

ప్రమాద ప్రదేశాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టండి

రద్దీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

-జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్

జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు హాట్ స్పాట్స్ ను గుర్తించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్.ఏ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పి రామాంజినాయక్, జిల్లా రవాణాధికారి కృష్ణారావు, మునిసిపల్ కమీషనర్ వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డా. మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వై జంక్షన్, బొమ్మల సత్రం, నూనెపల్లి, తదితర ముఖ్య కూడలి ప్రదేశాల్లో హాట్ స్పాట్స్ ను గుర్తించి రహదారి ప్రమాదాలు నియంత్రించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కమిటీ సూచించిన నివేదిక మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ట్రాఫిక్, పోలీసు అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు గురైన రహదారులను గుర్తించి కౌన్సిల్ తీర్మానం చేసి సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లపై గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రతి రోజు వార్తా పత్రికల్లో వస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫీల్డ్ మెకానిజం ఏర్పాటు చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ముఖ్యంగా ప్రమాద స్థలాలను గుర్తించి సంబంధిత ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట స్పీడ్‌బ్రేకర్లు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారికి గ్రామాల నుంచి కలిసే అనుసంధాన రోడ్లకు ఇరువైపులా అవసరమైన చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు వేయడంతో పాటు భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదకర స్థలాల్లో 108 వాహనాలు, వాటి పరిసర పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్‌ ఆదేశించారు. జాతీయ రహదారులపై అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు పోలీసు, రవాణా, జాతీయ రహదారుల శాఖల అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, సీట్ బెల్ట్ ధరించకపోవడం,సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహన చోదకులపై జరిమానా విధించడంతో పాటు తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి ప్రమాదాల నివారణపై అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓ ను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, పీఆర్‌ ఆర్ అండ్ బి ఈఈలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు, అన్ని డివిజన్ల డిఎస్పీలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.