రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలి
-వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి
-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
నకిలీ విత్తనాలకు నంద్యాల బ్రాండ్ గా పేరొస్తున్న ప్రమాదాన్ని గుర్తించి వ్యవసాయ అధికారులు అప్రమత్తమై నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక దాడులు నిర్వహించి నంద్యాల జిల్లాను వ్యవసాయ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్.ఏ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మార్క్ ఫెడ్ చైర్పర్సన్ పి.పి. నాగిరెడ్డి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, వ్యవసాయ మండలి సభ్యులు శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ముందస్తు సమాచారం ఇస్తూ మొక్కుబడి రీతిలో దాడులు నిర్వహించకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయ దుకాణాల లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. అవసరమైతే విజిలెన్స్ సహకారం తీసుకుని రెండు నెలలపాటు దాడులు ముమ్మరం చేసి నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ఇప్పటివరకు ఎన్ని షాపులు తనిఖీ చేశారు…. ఎన్ని బృందాలు ఏర్పాటు చేశారు… తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అలాగే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు కూడా నకిలీ విక్రయాలు జరగకుండా అరికట్టాలన్నారు. నంద్యాల ప్రాంతంలో అన్ని రకాల నేలలు ఉన్నాయని… ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు ప్రొద్దు తిరుగుడు, కుసుమ తదితర ఆయిల్ సీడ్ పంటలు వేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాలకు లక్ష్యాన్ని నిర్దేశించి రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కన్నా మంచి ఆదాయం వున్నా… అత్యంత లాభదాయకమైన పట్టు ఉత్పత్తి పంట కేవలం 3 నెలల సమయంలోనే దిగుబడి వస్తుందని పట్టు పంటలు వేసుకునేందుకు రైతులను ప్రోత్సహిస్తూ జిల్లాకు కేటాయించిన 350 ఎకరాలలో పట్టు ఉత్పత్తిని సాగు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిడి ని ఆయన సూచించారు. నంద్యాల ప్రాంతంలో నర్సరీలు అధికంగా ఉన్నాయని వాటికి సీడ్ ఇస్తున్న వివరాలు సేకరించడంతో పాటు నకిలీ విత్తనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారిని సూచించారు. అలాగే బరక, బీడు భూముల్లో వెదురు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో పశుసంపదను పోషించేందుకు మెట్ట నేలలు, అటవీ భూములు ఉన్నాయని… తొలకరిలకు రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పశుసంపదను చనిపోయే స్థితికి తీసుకురాకుండా సరైన సమయానికి వాక్సినేషన్ అందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగక ముందే రైతు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను సూచించారు. జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల అంశాన్ని వ్యవసాయ అధికారులు సీరియస్ గా తీసుకుని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తే సంబంధిత దుకాణాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత వ్యక్తుల పై కేసులు నమోదు చేయాలన్నారు. మండల స్థాయి బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేయడంతోపాటు విస్తృతంగా దాడులు నిర్వహించాలన్నారు. వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు వేసుకున్న ప్రతి పంటను ఈ క్రాఫ్ బుకింగ్ చేయడంతోపాటు ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించే పంటలపై అవగాహన కల్పించాలన్నారు. సాగుకు ముందే నాణ్యమైన విత్తనాలు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు రైతులకు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించి రైతులు లాభసాటి పంటలు వేసుకునేలా ప్రోత్సహించి సంబంధిత పంట ఉత్పాదకతలో శిక్షణనిచ్చి ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ హబ్ గా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని సాగునీటి కాలువలకు జూలై మొదటి వారంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఇందుకు సంబంధించి క్యాలెండర్ ను రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని… ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతులలోకి తీసుకెళ్లి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. రైతులు వేసిన పంటలు 100% కలర్ బుకింగ్ చేయాలన్నారు. అవుకు రిజర్వాయర్ పరిధిలోని పొలాలు నీటితో నిండి నిరుపయోగంగా ఉన్నాయని సంబంధిత రైతులకు చేపల ఉత్పత్తిపై అవగాహన కల్పించాలని మత్స్య శాఖ డిడిని ఆదేశించారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో శాండీస్ ఆయిల్ ఉత్పాదకతకు అవకాశం ఉంటుందని ఈ మేరకు రైతుల ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మత్స్య సంపద ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేసిందని జిల్లాలోని రిజర్వాయర్లలో మత్స్యశాఖ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీని ఆదేశించారు. వ్యవసాయ రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక సబ్సిడీలు మంజూరు చేస్తోందని వీటి వినియోగించుకునేందుకు సంబంధిత పథకాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను సూచించారు. నంద్యాల ప్రాంతంలో సారవంతమైన భూములు ఉన్నాయని ఈ ప్రాంతం నుండే మొక్కజొన్న, జొన్న పంటలు ఎగుమతి చేస్తున్నారన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ముందుగానే స్టాక్ తెప్పించుకుని రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న విత్తన విక్రయ కేంద్రాలకు లైసెన్సులు జారీ చేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. మార్క్ ఫెడ్ చైర్పర్సన్ పి.పి. నాగిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ యంత్ర పనిముట్లు గ్రూపులకు కాకుండా వ్యక్తిగత రైతులకే పంపిణీ చేసే విధంగా తీర్మానించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యపు ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు వేసిన పంటలకు ఈ క్రాఫ్ బుకింగ్, ఇన్సూరెన్స్ చేపట్టాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి మోహన్ రావు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసులు రెడ్డి, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖలు,ఏపీఎంఐపీ, మార్కెటింగ్, ఏపీఎంఐపీ, తదితర శాఖల అధికారులు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ మొబైల్ వాహనాన్ని ప్రారంభించి సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు.