జోలదరాసి, రాజోలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి
కుందూనది విస్తరణ పరివాహక ప్రాంతాల్లో ఫీజుబిలిటీని బట్టి చెక్ డ్యామ్ ల నిర్మాణాలు చేపట్టండి
జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా
రుతుపవనాల ఆగమనంతో ముందస్తు వర్షాలు కురిసి శ్రీశైల జలాశయంలో 854 అడుగుల నీటి పరిమాణానికి చేరిన వెంటనే ఖరీఫ్ సీజన్ కు అన్ని సాగునీటి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా వెల్లడించారు. గురువారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్.ఏ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధ్యక్షతన నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిజా హర్షవర్ధన్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, జలవనరుల శాఖ ఎస్ఈ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు రిజర్వాయర్లలో నీటి లభ్యతను బట్టి జులై మొదటి వారంలో అన్ని కాలువలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ముందస్తు వర్షాలు కురిసి… శ్రీశైల జలాశయంలో 854 అడుగుల నీటి పరిమాణానికి చేరిన వెంటనే నీటిని డ్రా చేసి అన్ని రిజర్వాయర్ లను నింపి తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, హెచ్ఎన్ఎస్ఎస్ తదితర కాలువల ద్వారా ఎప్పటి నుండి ఏ తేదీ వరకు నీటిని విడుదల చేసే ఖచ్చితమైన తేదీలను రైతులకు వివరిస్తామని మంత్రి తెలిపారు. నంద్యాల జిల్లాలో సాగునీటి కాలువలకు ప్రధాన వనరు అయిన శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 812 అడుగుల నీటి సామర్థ్యం మాత్రమే ఉందన్నారు. వర్షాలు వచ్చి శ్రీశైల జలాశయం 854 అడుగుల వరకు వచ్చిన వెంటనే మరోసారి నీటి పారుదల మండలి సమావేశాన్ని నిర్వహించి కాలువలకు నీటిని మళ్లించే తేదీలను ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. జోలదరాసి, రాజోలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ను మంత్రి సూచించారు. అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సహాయసహకారాలు తీసుకొని రైతులతో ధరలను నిర్ధారించి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే కుందూనది విస్తరణ పనులను వేగవంతం చేసి ఫీజుబిలిటీని బట్టి అవసరమైన ప్రదేశాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో సాగునీటి కాలువల కింద 1,76,309 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. జోలదరాశి, రాజోలి రిజర్వాయర్ల నిర్మా పనులను ముమ్మరం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణకు నిధుల కొరత లేదని రైతులతో నెగోషియేట్ చేసి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు కన్ఫ్యూజ్ లేకుండా సమన్వయంతో రైతులకు సహకరించి మోటివేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కేసీ కెనాల్ చివరి ఆయకట్టు భూములకు సాగునీటిని అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నరసపల్లి సమీపంలో చెరువు ఏర్పాటుకు అవసరమైన 40 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలని అవసరమైతే తన నిధుల నుండి వెచ్చిస్తానని ఎంపీ ఇరిగేషన్ అధికారులను సూచించారు. ఉయ్యాలవాడ, నొస్సం,సంజామల ప్రాంతాలలో ఎస్ ఆర్ బి సి కెనాల్స్ లో ఉన్న పెండింగ్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మాట్లాడుతూ శ్రీశైల జలాశయంలో 854 అడుగుల నీటి పరిమాణం వచ్చేంతవరకు తెలంగాణ పవర్ జనరేషన్ కు వినియోగించుకోకుండా కృష్ణ అడ్వైజరీ బోర్డ్ కు తెలపాలని వివరించారు. కుందూనదికి సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేయడం వల్ల రెండు పర్యాయాలు పరివాహక ప్రాంతాల పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని… దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే విషయాన్ని రైతులకు ముందుగానే తెలియజేయాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ మాట్లాడుతూ మల్యాల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ల ద్వారా మా నియోజకవర్గం నుండి నుండి నీళ్ళు వెళుతున్నాయని అయినప్పటికీ ఒక చుక్క నీరు కూడా మా పొలాలకు వినియోగించుకోవడం లేదన్నారు. కొక్కరంచ, జూపాడు బంగ్లా-1 ఎత్తిపోతల కు సంబంధించిన మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు. జడ్డువారిపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి చెరువులు నింపితే ఎన్నో ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 300 చెరువులు…దాదాపు 80 వేల ఆయకట్టు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు. ఆయుకట్టు దారులకు పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. కాలువల మరమ్మతులు, పూడిక వల్ల కేవలం 70 శాతం వరకే నీరు పంటపొలాలకు ఉపయోగపడుతుందన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు దారులకు ముచ్చుమర్రి, మల్యాల స్కీముల నుండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీటిని ఇచ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సహకరించాలని ఆయన సూచించారు. హెచ్ఎన్ఎస్ఎస్ నుండి మిడ్తూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే సమీపంలోని చెరువులను నీటితో నింపుకోవచ్చన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న వెలగమాన్ అప్రోచ్ కాల్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టు, ఎస్ఆర్బిసి సర్కిల్ 1,2 ల పర్యవేక్షక ఇంజనీర్లు, నంద్యాల, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.