You are currently viewing దొర్నిపాడు మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

దొర్నిపాడు మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

  • Post category:Nandyal

ప్రజలకు జవాబుదారీతనంతో విధులు నిర్వహించండి

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

అంగన్వాడీ సూపర్వైజర్, టీచర్, హెల్పర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం దొర్నిపాడు మండల కేంద్రంలోని తహసీల్దారు, ఎంపీడీవో, వ్యవసాయశాఖ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి కేంద్రం, గ్రామ సచివాలయాలను సుడిగాలి పర్యటన చేస్తూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధినిర్వహణలో అలసత్వం వహించినా, నిర్దేశించిన నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైనా, నిర్ణీత గడువులోపు పూర్తి చేయకపోయినా సంబంధిత అధికారును ఎవరినీ ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తొలుత దొర్నిపాడు మండల తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శిస్తూ సిబ్బంది హాజరు పట్టికను కలెక్టర్ పరిశీలించారు. స్పందన ఫిర్యాదులకు సంబంధించి ఎన్ని పెండింగ్ లో వున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పందనలోని ప్రతి అర్జీదారుని దరఖాస్తు పరిశీలిస్తూ సంబంధిత అర్జీ దారులకు ఫోన్ కాల్ చేయించి వారి సమస్యల పరిష్కారంపై సంతృప్తి చెందారో లేదో తెలుసుకున్నారు. స్పందన వినతులపై తక్షణమే స్పందించి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శిస్తూ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ కూలీల సంఖ్య పనులు జరుగుతున్న వివరాలు, జనజీవన్ మిషన్ కింద చేపడుతున్న పనులు, ప్రయారిటీ బిల్డింగులు, చెత్త సంపద తయారీ కేంద్రాలు, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీస్తూ ఎంపీడీవో నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను గణనీయంగా పెంచి పనులు కావాలని అడిగిన వారందరికీ పనులు కల్పించాలని ఎంపీడీవో ను కలెక్టర్ ఆదేశించారు. అప్పగించిన పనులను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శిస్తూ ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఖరీఫ్ సీజన్ కు సమాయత్తమై రైతు భరోసా కేంద్రాలను పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన రసాయనిక ఎరువులు, నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేస్తూ నెలలో ఎన్ని ప్రసవాలు జరిగాయని… ఎంత మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్ల వ్యవస్థను పటిష్టం చేసి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం దొర్నిపాడు గ్రామ సచివాలయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్ అటెండెన్స్ పరిశీలిస్తూ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.సచివాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సర్వీసులపై వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటూ ఏ ఒక్కటి పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులోగా సర్వీసులు అందించాలని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం దొర్నిపాడు అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ పిల్లల హాజరు, పోషక పదార్థాల పంపిణీ తదితరాలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులు ఏమీ లేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అంగన్వాడీ కేంద్ర టీచర్, హెల్పర్, సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత క్లస్టర్ సిడిపిఓను కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో జగనన్న గోరుముద్ద, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కింద బాలలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషక ఆహార పదార్థాలను పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.