రాయలసీమకు చట్టబద్ద హక్కులు , సాగునీటి ప్రాజెక్టులు,సాగునీటి విషయంలో రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని తద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. మే 31 న జరుగనున్న సిద్దేశ్వర జలదీక్షను పురష్కరించుకుని నంద్యాల బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు అద్యక్ష్యతన రాయలసీమకు చట్టబద్ద నీటిహక్కులు, సిద్దేశ్వర అలుగు నిర్మాణ ఆవశ్యకత గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ వాటి సాధనకై ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. రాయలసీమ అభివృద్ధి లోనూ, త్రాగు, సాగునీటి విషయంలోనూ శతాబ్ద కాలం నుంచి రాయలసీమ ప్రాంతం వివక్షతకు గురి కావడానికి మనలో అవగాహన, చైతన్యం లేకపోవడమే కారణమన్నారు. ఏ ప్రాంతమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నీరే ప్రధానమని, ఆ నీటి హక్కులకోసం జరుగుతున్న ఉద్యమాలకు న్యాయవాదులు కూడా అండగా నిలబడాలని దశరథరామిరెడ్డి కోరారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి మన నీటి హక్కుల కోసం రైతుల భాగస్వామ్యంతో అనేక ఉద్యామాలు చేస్తోందనీ, ఆ ఉద్యమాల్లో భాగంగా 2016 సంవత్సరం మే 31 న వేలాదిమంది ప్రజలతో పాటుగా రాయలసీమ లోని న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సిద్దేశ్వర అలుగు ప్రజా శంఖుస్థాపనను విజయవంతం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని, రాయలసీమకు చట్టబద్ద నీటిహక్కులకై గత డిసెంబరు 13 న విజయవాడ నగరంలో జరిగిన రాయలసీమ ధర్మదీక్ష కార్యక్రమానికి కూడా మన జిల్లా నుంచి న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొన్న విషయం గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలనీ, రాయలసీమ ప్రజల హృదయ స్పందన అయిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి పాలక, ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు చట్టబద్ద నీటిహక్కులు, సాగునీటి ప్రాజెక్టుల సాధనకై సీమ ప్రాంత రాజకీయ నాయకులు ఏ మాత్రం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. సిద్దేశ్వర అలుగు కోసం మనమంతా ఎక్కడైతే ప్రజా శంఖుస్థాపన చేసామో అక్కడ జాతీయ రహదారిలో భాగంగా వంతెనని నిర్మిస్తున్నారని, అక్కడ వంతెనతో పాటు అలుగు కూడా నిర్మించాలని తాము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు వ్రాసామని దశరథరామిరెడ్డి తెలిపారు. వంతెనతో పాటు అలుగు నిర్మాణం జరిగేటట్లుగా మన ప్రాంత ఎమ్మెల్యే,ఎం.పిలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సీమ ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేశారు. అతి తక్కువ ఖర్చుతో, ఏ భూసేకరణ అవసరంలేని ఈ సిద్దేశ్వర అలుగు నిర్మాణం జరిగితే రాయలసీమ ప్రజల కడగండ్లు తీరుతాయని, 70 ఏళ్ళ రాయలసీమ ప్రజల కల నెరువేరుతుందని దశరథరామిరెడ్డి తెలిపారు. 1951 లోనే రూపుదిద్దుకున్న ఈ సిద్దేశ్వరం ప్రాజెక్టు మన పాలకుల, సీమ నాయకుల నిర్లక్ష్యంతో నాగార్జునసాగర్ గా నిర్మించి మన సీమ ప్రజల పొట్టను కొట్టారని విమర్శించారు. 1951 లోనే సిద్దేశ్వర ప్రాజెక్టు నిర్మాణం జరిగి వుంటే మన సీమ ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండేదని దశరథరామిరెడ్డి తెలిపారు. మన సీమ నాయకులు రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా తమ గళం విప్పి వంతెనతో పాటు అలుగు నిర్మాణం జరిగేటట్లుగా ప్రభుత్వాలపై ఒత్తడి పెంచాలని ఆయన కోరారు. రాయలసీమ ప్రజలు కూడా మన నీటి హక్కులపై జరుగుతున్న అన్యాయాలపై అవగాహన చేసుకుని మన దగ్గరకు వచ్చే రాజకీయ నాయకులను ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలని, మన నీటి హక్కుల కోసం పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలని అలా కాని పక్షంలో భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతానికి సాగు, త్రాగు నీటి విషయంలో తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాయలసీమ అస్తిత్వం కోసం, సిద్దేశ్వర అలుగు సాధన కోసం మే 31 న జరిగే సిద్దేశ్వర జలదీక్ష లో మన జిల్లా న్యాయవాదులు కూడా పాల్గొని ఈ జలదీక్ష ను విజయవంతం చేసి ప్రభుత్వానికి మన గొంతుక వినిపిద్దామని దశరథరామిరెడ్డి న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, బార్ అసోషియేషన్ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

రాయలసీమ అస్తిత్వ పోరాటానికి న్యాయవాదులు అండగా నిలబడాలి
- Post published:May 17, 2022
- Post category:Nandyal